UPSC: దివ్యాంగులు కలెక్టర్లు కావొద్దా?.. స్మిత వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా?

ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకంటూ IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పెను దుమారానికి కారణమైంది. నెటిజన్లతో పాటు డాక్టర్లు, సైక్రియాట్రిస్టులు స్మితా కామెంట్స్‌ను తప్పుపడుతున్నారు. చాలా వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, తెలివితేటలపై ప్రభావం చూపవని గుర్తుచేస్తున్నారు.

author-image
By srinivas
New Update
UPSC: దివ్యాంగులు కలెక్టర్లు కావొద్దా?.. స్మిత వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా?

Smita Sabharwal: అది ఆగస్టు 30, 2021.. పారాలింపిక్స్ వేదికపై భారత జాతీయ గీతాన్ని సగర్వంగా వినిపించేలా చేసింది షూటర్ అవని లేఖరా. పదకొండేళ్ల వయసులో జీవితంలో ఒక్కసారిగా అలుముకున్న చీకట్లను ఛేదించిన ఆమె ఒలింపిక్స్‌లో భారత్‌కు గోల్డ్‌మెడల్‌ సాధించి యావత్‌ దేశానికి స్పూర్తిగా నిలిచింది. ఇలాంటి అవనిలు చాలామంది కనిపిస్తారు. అంతులేని వ్యథలను దాటుకోని విజయాలు సాధిస్తారు. అయితే కొంతమందికి మాత్రం ఇప్పటికీ దివ్యాంగులంటే చిన్నచూపే.. వారికి కల్పించే రిజర్వేషన్‌ అనవసరమనే భావన కొంతమందిలో కనిపిస్తుంటుంది. ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకంటూ IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పెను దుమారానికి కారణమైంది.

శక్తిసామర్థ్యాలు తెలివితేటలపై ప్రభావం చూపవు..
సివిల్స్ నియామకాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా కింద రిజర్వేషన్లు అవసరం లేదంటున్నారు స్మితా. క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన ఉద్యోగాల్లో కోటా ఎందుకని.. డెస్క్‌లో పని చేసే ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని ట్వీట్ చేశారు. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్స్ నియమించుకుంటుందా? లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా అని స్మితా ప్రశ్నించారు. అయితే నెటిజన్లతో పాటు డాక్టర్లు, సైక్రియాట్రిస్టుల స్మితా కామెంట్స్‌ను తప్పుపడుతున్నారు. చాలా వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, తెలివితేటలపై ప్రభావం చూపవని గుర్తుచేస్తున్నారు. నిజానికి సర్జన్‌లలో దివ్యాంగులు ఎప్పటినుంచో ఉన్నారు. ఈ విషయం స్మితాకు తెలియకపోవడం బాధాకరమని కౌంటర్ వేస్తున్నారు.

ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వొచ్చా?
అటు ఐపీఎస్‌, ఐఏఎస్‌ ఆఫీసర్లలో చాలామంది దివ్యాంగులు ఇప్పటికే సత్తా చాటారు. రిజర్వేషన్‌ కోటాలోనే కాకుండా మెరిట్‌ కోటాలోనూ ఎగ్జామ్‌ను క్రాక్‌ చేసిన వారి సంఖ్య కూడా ఎక్కువే. అటు CSB IAS Academy ద్వారా వందలాది మందిని సివిల్స్‌ విజేతలుగా నిలిపిన బాలలత సైతం స్మితా కామెంట్స్‌ను తప్పుబట్టారు. చిన్నవయసులోనే రెండు కాళ్లనూ పోలియో మహమ్మారి కబళించినా సివిల్స్‌ రాసి 167వ ర్యాంకు సాధించిన బలలతా ఎంతోమంది UPSC అస్పిరెంట్స్‌కు స్పూర్తిదాయకం. ఇక బాధ్యతాయుతమైన పోస్ట్‌లో ఉండి ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వొచ్చా అంటూ స్మితాను ప్రశ్నించారు బాలలత!

ఇది కూడా చదవండి: Pawankalyan: అహంకారం తగ్గించుకుని ఆ భ్రమలోనుంచి బయటపడు.. జగన్‌పై పవన్ ఫైర్!

ఖగోళ శాస్త్రవేత్తగా స్టీఫెన్‌ హాకింగ్‌..
కూర్చున్న చోటి నుంచి లేవలేకపోవడం శారీరక సమస్య అయితే... అలా లేవలేకపోవడానికి సరైన సహకారాన్ని అందించకపోవడమే అసలైన సామాజిక వైకల్యం. ఈ సామాజిక వైకల్యం పట్టిపీడిస్తున్న ఈ సమాజంలో కొందరు స్వశక్తితో ఎదిగి, ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ప్రాచీన గ్రీకు మహాకవి హౌమర్‌ అంధుడు. మాటలు రాని, కళ్ల కనపడని, వినికిడి లోపంతో చిన్నతనం నుంచే ఏకాకిగా మారిన హెలెన్‌ కెల్లర్‌ తన అమోఘ మేధోశక్తితో 'బ్రెయిలీ' లిపి నేర్చుకుని, పాండిత్యం సంపాదించారు. ఇక స్టీఫెన్‌ హాకింగ్‌ కదలడానికి సహకరించని అవయవాలు, చక్రాల కుర్చీకి అతుక్కుపోయిన శరీరం, మాట్లాడటానికీ కంప్యూటర్‌ సహాయం.. అయినా వైకల్యాన్ని ఎదిరించి, ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్తగా ఎదిగారు.

వైకల్యం శరీరానికేగానీ ప్రతిభకు కాదు..
ఆటిజంతో బాధపడుతూ గెలుపు దిశగా సాగిన అత్యంత విజయవంతమైన వ్యక్తుల జాబితాలో ఎవరైనా ఉన్నారంటే.. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అటు జాన్‌ మిల్టన్‌కు అంధత్వం ఉన్నా గొప్ప కవిగా మారడాన్ని ఆయన వైకల్యం ఆపలేకపోయింది. ఇక ఇండియా విషయానికొస్తే సుధా చంద్రన్‌, రవీంద్ర జైన్‌, గిరీష్‌ శర్మ, రామకృష్ణన్‌, ప్రీతి శ్రీనివాసన్‌, అరుణిమ సిన్హా, మాలతీ కృష్ణమూర్తి లాంటి వారెందరో ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపించారు. వైకల్యం శరీరానికేగానీ ప్రతిభకు, ఉన్నత లక్ష్యానికీ కాదని రుజువు చేశారు.

కఠోర శ్రమతో ఎందరో విభిన్న ప్రతిభావంతులు జీవితాన్ని గెలిచారు. ఎందరినో గెలిపిస్తూ ఉన్నారు. అలాంటి విభిన్న వెలుగురేఖలు నాటి నుంచి నేటి వరకూ విస్తరిస్తూనే ఉన్నాయి. అయినా వివిధ రంగాల్లో వారి ప్రాతినిధ్యం తక్కువే.. వారి గురించి మాట్లాడే గొంతుకులు తక్కువే.. ఈ విషయాలన్ని IAS ఆఫీసర్‌గా ఉన్న స్మితాకు తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని విమర్శిస్తున్నారు నెటిజన్లు.

Advertisment
Advertisment
తాజా కథనాలు