c-VIGIL APP: ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే.. యాప్ ద్వారా ఇలా ఫిర్యాదు చేయండి!

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం 'సి-విజిల్' యాప్‌ను లాంచ్ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించే అభ్యర్థులపై ఈ యాప్‌లో ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఫొటో లేదా వీడియోను ఆ యాప్‌లో అప్‌లోడ్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

c-VIGIL APP: ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే.. యాప్ ద్వారా ఇలా ఫిర్యాదు చేయండి!
New Update

మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మిజోరాంలో ఎన్నికలు జరగగా.. ఛత్తీస్‌గఢ్‌లో కూడా మొదటి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు భారత ఎన్నికల సంఘం ఇప్పటికే ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే.. ఫిర్యాదులు చేసేందుకు సి-విజిల్‌ ఆప్‌ను లాంచ్ చేసింది. అయితే మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  జిల్లాల ఎన్నికల అధికారులు ఈ సీ-విగిల్ ఆప్‌ను ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని ఎలా వాడాలి అనేదానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విద్వేష ప్రసంగాలు చేయడం, ఓటర్లను రెచ్చగొట్టడం.. డబ్బులు, మద్యం పంచడం లాంటివి చేస్తే.. వీళ్లపై ఈ సి-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

మంగళవారం సాయంత్రం నాటికి హైదరాబాద్‌ జిల్లాలో దాదాపు 87 ఫిర్యాదులు వచ్చాయి. ఈ వారంలోనే సుమారు 26 ఫిర్యాదులు సి-విజిల్ యాప్‌లో నమోదయ్యాయి. అందరూ సులభంగా వినియోగించే రీతిలో ఈ యాప్‌ను తయారుచేశారు. అయితే ఇది ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనే పనిచేస్తుంది. ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి సి-విజిల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్ ఇన్‌స్టాల్ అయ్యాకా లాగిన్ అవ్వాలి. పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, తదితర వివరాలను నమోదు చేయాలి. వ్యక్తిగత వివరాలు ఇవ్వకుండా కూడా లాగిన్ అయ్యే సౌకర్యం ఉంది.

ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగడాన్ని చూసినప్పుడు.. ఫొటో లేదా రెండు నిమిషాల నిడివితో ఉన్న వీడియోలను సి-విజిల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అయితే ఫొటో, వీడియో ఆప్‌లోడ్‌ చేసే సమయంలో ఫోన్‌లో జీపీఎస్‌ ఆన్‌ ఉండాలి. ఫిర్యాదు చేసే వ్యక్తి తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. యాప్‌ ద్వారా వివరాలు నేరుగా జిల్లా ఎన్నికల అధికారికి వెళ్తాయి. క్షేత్రస్థాయిలో 24 గంటలు పనిచేసే సిబ్బంది ఈ ఫిర్యాదులను పరిశీలించి, వంద నిమిషాల్లో పరిష్కరించి మీకు కేటాయించిన ఐడీకి తిరిగి పంపిస్తారు.

ఎలాంటి ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయవచ్చంటే..

ఓట్ల కోసం అభ్యర్థులు, వాళ్ల అనుచరులు ప్రజలను భౌతికంగా, మానసికంగా భయాందోళనకు గురిచేయడం.

బహిరంగ సమావేశాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేసి ఓటర్లను రెచ్చగొట్టడం.

ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, వస్తువులు పంపిణీ చేయడం.

ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా స్పీకర్లు పెట్టడం.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో బాధ్యతారహితంగా వ్యవహరించడం.

#telugu-news #telangana-elections #assembly-elections #c-vigil-app
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe