PM Modi : పార్లమెంట్ ఎన్నిక(Parliament Elections) లకు కేవలం కొన్ని రోజుల ముందు కేంద్రంలోని బీజేపీ(BJP) బిగ్ షాక్ తగిలింది. హర్యానాలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కమలనాథులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆరుగురు ఇండిపెండెంట్లలో ముగ్గురు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు వారు గవర్నర్‌కు లేఖ రాశారు. తాము లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections)ల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్, రణ్‌ధీర్ గొల్లెన్, ధరమ్‌పాల్ గొండెర్ ప్రకటించారు. రోహ్‌తక్‌లో మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్ హుడా, హర్యానా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్‌భాన్‌తో కలిసి వారు ప్రెస్‌మీట్ నిర్వహించారు.
రైతుల సమస్యల పరిష్కారంలో బీజేపీ సర్కార్ విఫలం అయ్యిందంటూ వారు విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలు తీవ్రమయ్యాయని ఆరోపించారు. ఇప్పటికే బీజేపీతో జన్‌నాయక్ జనతా పార్టీ తెగదెంపులు చేసుకుంది. దీంతో బీజేపీ ప్రభుత్వం మైనార్టిలో పడిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. సీఎం సైనీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాలతో నాయబ్‌సింగ్‌సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కష్టాల్లో పడింది.
హార్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో 88 మంది సభ్యులు ఉన్నారు. దీంతో ఆ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 45. 2019 ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకుంది. 10 స్థానాల్లో జన్‌నాయక్ జనతా పార్టీ (JJP) విజయం సాధించింది. మరో ఆరుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఇక్కడ గెలుపొందారు. వీరందరితో పాటు ఒక HLP ఎమ్మెల్యే మద్దతుతో ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల సీట్ల పంపకాల్లో తేడాలు రావడంతో బీజేపీతో JJP తెగతెంపులు చేసింది. ఇండిపెండెంట్లలో ముగ్గురు మద్దతు ఉపసంహరించుకున్నారు.
Also Read : కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ-40మంది..ఇండిపెండెంట్స్-ఇద్దరు.. ఒక HLP ఎమ్మెల్యే మద్దతు ఉంది. అంటే 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఉంది. దీంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందన్న చర్చ సాగుతోంది. 2014లో మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వానికి ఇంత ఇబ్బంది రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఇక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం ఎలాంటి వ్యూహాలు రచించనుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.