కర్ణాటకలోని ఇప్పుడు పులిగోరు అంశం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల పులిగోరు ధరించారనే కారణంతో బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న వర్తుర్ సంతోష్ అనే వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం జరిగిన అనంతరం పులిగోర్లు ధరించిన కొంతమంది ప్రముఖులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వెంటనే వాళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్ల నుంచి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు దర్శన్, జేడీఎస్ నేత నిఖిల్ కుమారస్వామి, బీజేపీ రాజ్యసభ ఎంపీ జగ్గేశ్, సినీ నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ సహా తదితరులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు వీటిపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు.. ప్రధాని మోదీకీ ఆహ్వానం..
ఇక వర్తుర్ సంతోష్‌ను బిగ్‌బాస్ హౌస్ నుంచి అరెస్టు చేశాక.. ఎంపీ జగ్గేశ్ రెండు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఓ ఇంటర్యూ ఇప్పుడు బయటపడింది.అయితే ఇందులో జగ్గేశ్ పులిగోరు ధరించి కనిపించారు. అంతేకాదు తన 20వ పుట్టినరోజు సందర్భంగా తన తల్లి బహుమతిగా ఇచ్చిందని చెప్పారు. తాను పులిలా పెరగాలనే ఉద్ధేశంతో ఈ పులిగోరు ఇచ్చారని ఆ ఇంటర్యూలో చెప్పారు జగ్గేశ్. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటీజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పటి దాకా ఎంపీ జగ్గేశ్ స్పందించలేదు. ఇదిలా ఉండగా.. మరోవైపు జేడీఎస్ నేత నిఖిల్ కుమారస్వామి.. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. తన ధరించింది నకిలీ పులిగోరు అంటూ వివరణ ఇచ్చారు. తన పెళ్లికి ఎవరో గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాదు కావాలంటే అధికారులు తనిఖీ చేసుకొవచ్చని కూడా చెప్పారు.
అయితే సోషల్‌మీడియాలో వస్తున్న వీడియోలు, ఫొటోలపై ఇప్పటికే అటవీ అధికారులు రంగంలోకి దిగారు. కన్నడ నటుడు దర్శన్ ఇంట్లో అటవీ అధికారులు సోదాలు చేశారు. అలాగే మరికొందరి సెలబ్రిటీల ఇళ్లలో కూడా సోదాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 వ్యతిరేకంగా ఎవరైనా పులిగోరు ధరించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అలాగే నేరానికి పాల్పడితే ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖంద్రే స్పష్టం చేశారు.