Birthday party: స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైన ఓ యుకుడికి అదే రోజు డేత్ డేగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ కావాలని కొత్త ట్రెండ్ కోసం ట్రై చేస్తున్న కుర్రాళ్లు కొన్నిసార్లు తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ముఖ్యంగా పుట్టిన రోజు వేడుకల్లో ఎన్ని సంవత్సారాలు నిండితే అన్ని పిడిగుద్దులు, కేకుపై ముఖం పెట్టి రుద్దడం వంటి పిచ్చిపనులు చేస్తూ కుటుంబాల్లో తీరని శోకం మిగిలిస్తున్నారు. అయితే మాదాపూర్‌లోని ఓ ఐటీ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న శ్రీకాంత్ అనే యువకుడు బర్త్ డేకు వచ్చిన అజయ్ అనే వ్యక్తి స్వమ్మింగ్ పూల్ లో మునిగి చనిపోవడం సంచలనం రేపుతుండగా ఈ ఘోరానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
13 మంది అమ్మాయిలు, 7గురు అబ్బాయిలు..
ఘట్‌కేసర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాంత్ అనే యువకుడు మాదాపూర్‌లోని ఎస్ టెక్నాలజీ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయితే తన పుట్టిన రోజు సందర్భంగా తోటి ఉద్యోగులతో కలిసి ఓ ఫామ్ హౌస్‌లో పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి 13 మంది అమ్మాయిలు, 7గురు అబ్బాయిలు హాజరయ్యారు అర్ధరాత్రి వరకు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టారు. అయితే ఆజయ్ అనే యువకుడిని బలవంతంగా స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేశారు. అజయ్ కి ఈత రాదనే విషయం తెలియగా.. మద్యం మత్తుల్లో అలాగే వదిలేశారు. 45 నిమిషాల తర్వాత చూడగా అప్పటికే అజయ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనకు సంంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడు అజయ్ మేనమామ కిషోర్ ఫిర్యాదు మేరకు శ్రీకాంత్, రంజిత్ రెడ్డి, సాయికుమార్, ఫామ్ హౌస్ యజమాని వెంకటేష్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.