Mahabubabad : కరోనా(Corona) మహమ్మారి ఎంతోమంది ప్రాణాలు బలితీసుకుని ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. అయితే మహబూబాబాద్‌లో మూడేళ్ల క్రితం ఓ వ్యక్తి కరోనా బారిన పడి మృతి చెందాడు. దీంతో ఒంటరిగా మిగిలిపోయిన అతని భార్య(Wife) తీవ్ర వేదనకు గురైంది. తన భర్త రూపం ఎప్పటికీ కనిపించాలనే కోరికతో ఏకంగా ఆయనకు గుడి(Temple) కట్టించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారులోని సోమ్లా తండాలో బానోతు హరిబాబు - కల్యాణి దంపతులు నివసిస్తున్నారు.
Also Read: ఇంటర్ ఫలితాలు.. ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య
ఈ దంపతులకు 27 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్లకు సంతానం లేదు. అయితే 2021లో కరోనా బారిన పడి హరిబాబు మృతి చెందాడు. దీంతో కల్యాణి జీవితం ఒంటరిగా మారిపోయింది. భర్త తన ముందు లేడనే బాధతో ఆమె తీవ్ర మానసిక వేదనకు లోనైంది. చివరికి ఆమె ఓ దృఢమైన సంకల్పానికి వచ్చింది. తన భర్త రూపం ఎప్పటికీ తన కళ్లముందే కనిపించేలా ఉండేందుకు.. ఆయన విగ్రహాన్ని తయారు చేయించి గుడి కట్టాలని నిర్ణయించుకుంది. తన భర్త నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి.. ఓ గుడి కట్టించింది. ఏప్రిల్ 24 (బుధవారం) ఆమె కల నెరవేరింది.
దాదాపు రూ.20 లక్షలతో వారి తండాలో గుడి కట్టించారు. రాజస్థాన్(Rajasthan) లో విగ్రహం తయారు చేయించి తెప్పించారు. ఈ విగ్రహాన్ని గుడిలో ఏర్పాటు చేసి.. బుధవారం నాడు ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.
Also Read: మోడీ హిందూ సెంటిమెంటును రెచ్చగొడుతున్నారు: చాడ వెంకటరెడ్డి