వివాహితతో మొదట స్నేహమన్నాడు. తర్వాత ప్రేమిస్తున్నానని వేధించాడు. అయినా తాను తనభర్తను విడిచిపెట్టి రాలేనని తెగేసి చెప్పిందా వివాహిత. దీంతో ఆమెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. అడ్డుకోబోయిన భర్తను హత్యచేసి పారిపోయాడు. హైదరాబాద్ ఫిలిం నగర్ లో సంచలనం సృష్టించిన గౌస్ హత్యకేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
హైదరాబాద్ కు చెందిన వివాహిత లండన్ లో ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లింది. అక్కడే ఆమెకు అద్నాన్ పరిచమయ్యాడు. వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. అయితే అద్నాన్ మాత్రం ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధించడం మొదలు పెట్టాడు. అయితే ఆమె మాత్రం తనకు పెళ్ళైందని, తన భర్త తనను ఉన్నత చదువులు చదివించేందుకు లండన్ పంపించారని, ఆయనను వదిలే ప్రసక్తి లేదని తెగేసి చెప్పింది. కానీ అద్నాన్ అదేం పట్టించుకోలేదు. వివాహితను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆమెతో స్నేహితుడిలాగే ఉన్నట్టు నటించాడు. దీంతో ఆమె కూడా అతన్ని నమ్మింది. వారిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెరిగింది. ఆ సందర్భంలో ఇద్దరూ కలిసి పలుసార్లు ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత అద్నాన్ తన అసలు రూపాన్ని బయటపెట్ట సాగాడు. తనను పెళ్లి చేసుకోవాలని, భర్తను వదిలేయాలని కోరాడు. తనను వివాహం చేసుకోకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. అయినా దానికి వివాహిత భయపడకుండా తన భర్తను వదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది.
ఇది కూడా చదవండి :GOOD NEWS: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన
చదువు పూర్తి అయిన తర్వాత హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కు వచ్చిందా వివాహిత. వచ్చిన తర్వాత అద్నాన్ విషయంలో జరిగిన అన్ని విషయాలను భర్త గౌస్ కు వివరించింది. ఆమె సమస్యను అర్థం చేసుకున్న గౌస్ తానున్నానని, అద్నాన్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పాడు. కానీ అద్నాన్ మాత్రం కోపంతో రగిలిపోయాడు. ఆమెను కిడ్నాప్ చేసైన పెళ్ళి చేసుకోవాలని ప్లాన్ వేశాడు. అనుకున్నట్టే ఫిలింనగర్ లోనిగౌస్ ఇంటికి వచ్చాడు. వివాహితను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె గట్టిగా కేకలు వేసింది. గౌస్ అడ్డు పడ్డాడు. ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. దీంతో రెచ్చిపోయిన అద్నాన్ తన వద్ద ఉన్న కత్తితో గౌస్ పై దాడి చేసి చంపి పారిపోయాడు. ఇన్ని రోజులు భర్తకు దూరంగా లండన్ ఉండి, చదువు పూర్తి చేసుకుని భర్తతో ఆనందగా గడిపేందుకు వచ్చిన వివాహితకు కన్నీరే మిగిలింది. ఆమె ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అద్నాన్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు.