ఎన్డీయే ప్రభుత్వంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గం సభ్యుల్లో 70 మంది (99 శాతం) కోటీశ్వరులేనని బయటపడింది. ఈ మేరకు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) మంగళవారం ఓ నివేదికలో వెల్లడించింది. మంత్రుల సగటు ఆస్తి విలువ దాదాపు రూ.107.94 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఇక మంత్రుల్లో ఆరుగురుకి రూ.100 కోట్ల కన్నా ఎక్కువ ఆస్తులు ప్రకటించినట్లు తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,705.47 కోట్ల ఆస్తులు ప్రకటించి ఈ జాబితాలో మొదటిస్థానంలో నిలిచారు.
Also Read: భారీ అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవ దహనం
ఆ తర్వాత కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రెండో స్థానంలో నిలిచారు. ఇక ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి కుమారస్వామి రూ.217.23 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు ప్రధానిమోదీతో సహా ప్రమాణ స్వీకారం చేసిన 71 మందిలో 66 శాతం 50 ఏళ్లు నిండినవారే ఉన్నారు. 47 మందికి 51 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు ఉంది.
కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో 28 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. వాళ్లలో 19 మందిపై హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేష ప్రసంగం లాంటి తీవ్రమైన కేసులు నమోదైనట్లు ఏడీఆర్ విశ్లేషణలో తేలింది. పోర్టులు, జలరవాణశాఖ సహాయమంత్రి శాంతను ఠాకుర్, విద్య ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయమంత్రి సుఖాంత మజుందార్ ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యయత్నం అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, పెట్రోలియం, సహజవాయువు, పర్యాటక శాఖల సహాయమంత్రి సురేష్ గోపీతో సహా ఐదుగురు మంత్రులపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.
Also Read: రియాసి ఉగ్రదాడి.. ఇతన్ని పట్టిస్తే రూ.20 లక్షల రివార్డ్
మరో విషయం ఏంటంటే మంత్రివర్గం సభ్యుల్లో 11 మంది మంత్రుల విద్యార్హత కేవలం 12వ తరగతి మాత్రమే. అలాగే 57 మంది (80శాతం) మంది మంత్రుల విద్యార్హత గ్రాడ్యుయేట్ లేదా అంతన్నా ఎక్కవగా ఉన్నట్లు ఏడీఆర్ విశ్లేషణలో బయటపడింది.