ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ మధ్య యుద్ధం ఆగడంలేదు. ఈ భీకర యుద్ధంలో చనిపోతున్న అమాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజాపై కాల్పులు జరపవద్దని అంతర్జాతీయ సమాజం మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా అండతో రెచ్చిపోతోంది. తాజాగా దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 90 మంది మరణించారు. సుమారు 300 మంది గాయపడ్డారు. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ మిలిటరీ కమాండర్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్టు చెప్పారు. మహ్మద్ దీఫ్‌తో పాటు హమాస్ కమాండర్ రఫా సలామాను చంపేందుకు ఈ దాడులు చేశామని చెప్పారు. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో ఆ ఇద్దరు చనిపోలేదని తెలుస్తోంది.
అంతా డ్రామా:
ఖాన్ యునిస్‌లోని కంచె ప్రాంతంపై ఈ దాడి జరిగింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల చేసిన ప్రాంతంలో అసలు తమ కమాండర్ లేడని హమాస్ చెబుతోంది. అమాయకులను చంపేసి ఆ తప్పును కప్పిపుచ్చేందుకు ఇజ్రయెల్ డ్రామా ఆడుతుందని మండిపడుతోంది. ఇజ్రాయెల్ తప్పుడు వాదనలు భయంకరమైన ఊచకోత స్థాయిని దాచడానికి మాత్రమే ఉద్దేశించినవని హమాస్ పేర్కొంది.
బలైపోతున్న అమాయకులు:
2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేసింది. ఈ ఘటనలో దాదాపు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు, ఆర్మీ అధికారులు చనిపోయారు. ఈ దాడులకు ప్రతీకారంగా ఆ తర్వాత గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. నెలలు గడుస్తున్నా ఈ రెండు వర్గాల మధ్య భీకర యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో అమాయక ప్రజలు చనిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 10 నెలల కాలంలోనే దాదాపు 37 వేల మంది పాలస్తీయన్లు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. వీరిలో చాలామంది చిన్నారులు ఉండడం ఆందోళన కలిగించే అంశం.
Also Read: అమెరికా చరిత్రంతా హత్యలు, హత్యాయత్నాలే.. లింకన్ నుంచి ట్రంప్ వరకు.. !