చైనా.. ఈ భూమిపై ప్రతీది తనదేనని విర్రవీగే దేశం..! సరిహద్దు దేశాలతో నిత్యం కయ్యానికి కాలుదువ్వే చైనా ప్రకృతిపై పోరాటంలో మాత్రం ఘోరంగా చతికిలపడుతోంది. చైనా నిత్యం వరదలతో అల్లాడిపోతోంది. యాగి తుపాను దాటికి చైనాతో పాటు వియత్నం కూడా వణికిపోయింది. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇంతకీ చైనాలో తరుచుగా ఎందుకు వరదలు పోటేత్తుతున్నాయి? కారణమేంటి?
యాగి తుపాను కారణంగా వియత్నాంలో కొండచరియలు విరిగిపడటం, వరదలు సంభవించడంతో 60 మందికిపైగా చనిపోయారు. అటు చైనా, ఫిలిప్పీన్స్ దేశాలను అతలాకుతలం చేసిన యాగి ఈ దేశాల్లో 24 మందిని పొట్టనబెట్టుకుంది. యాగి తుపాను విధ్వంసం దృష్ట్యా చైనాలో దాదాపు అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. 100కి పైగా విమానాలను రద్దు చేశారు. ఎక్కడికక్కడ బిల్‌బోర్డ్‌లు పడిపోయి కొన్ని చోట్ల వాహనాలు బోల్తా పడ్డాయి. విపరీతమైన వాతావరణ మార్పులతోనే చైనాలో నిత్యం వరదలు సంభవిస్తున్నాయి. ఈ మార్పుల వల్ల సూపర్ టైఫూన్‌లు, తీవ్రమైన వర్షపాతం, కరువు లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇక చైనాలో నగరాల నిర్మాణం పేలవంగా ఉంటుంది. ఇక పట్టణ వృద్ధితో పాటు విచ్చలవిడి మైనింగ్ కార్యకలాపాలు చైనాలో వరదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
Also read: క్షణాల్లో నేలమట్టమైన 22 అంతస్తుల భారీ భవనం.. వీడియో వైరల్
ప్రపంచంలో వరదల కారణంగా ఎక్కువ మంది చనిపోయే దేశాల్లో చైనా రెండోస్థానంలో ఉంది. చైనాలో సంవత్సరానికి సగటున 1,000 మంది వరదల కారణంగా చనిపోతున్నారు. గ్రీన్‌హౌస్ వాయువులను ప్రపంచంలోనే అత్యధికంగా విడుదల చేసే దేశం చైనా. ఇది విపరీతమైన వాతావరణ మార్పులకు కారణం అవుతోంది. అందుకే చైనాలో రోజుల వ్యవధిలోనే వాతావరణం అనుహ్యంగా మారిపోతోంది. ఓ రోజు ఎండ మండిపోతుంటే మరో రోజు వర్షం దంచి దంచి కొడుతోంది.
ఇక ప్రస్తుతం వియత్నంతో పాటు చైనా, ఫిలిప్పీన్స్‌లో బీభత్సానికి కారణమైన యాగి తుపాను ఆసియాలోనే అత్యంత శక్తివంతమైనదిగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుపాను కారణంగా వియత్నంలో కనీసం 80 శాతం ఫ్యాక్టరీలు దెబ్బతిన్నాయి. తీరప్రాంత ప్రావిన్సుల్లో నాలుగు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయి. హనోయ్ సహా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ తుపాను వల్ల దాదాపు 3,300 ఇళ్లు, 1,20,000 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.