కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ మంగఫ్ అనే నగరంలోని ఓ భవనంలో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘనటలో 41 మంది మృతి చెందగా.. అందులో 40 మంది భారతీయులే ఉండటం కలకలం రేపుతోంది. బుధవారం ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో 160 మంది ఆ భవనంలో ఉన్నారని.. వీళ్లందరూ కూడా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు పేర్కొంది. ముందుగా కిచెన్‌లో ప్రారంభమైన ఆ మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించాయని అధికారులు తెలిపారు.
Also Read: రేపు సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే!
ఈ అగ్నిప్రమాదంలో 35 మంది మంటల్లో చిక్కుకొని సజీవ దహనమవ్వగా.. మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచారు. మృతి చెందిన 41 మందిలో.. 40 మంది భారతీయులే ఉన్నారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అలాగే మరో 50 మందికి పైగా ఈ ప్రమాదంలో గాయాలపాలయ్యారు. వీళ్లలో కూడా 30 మంది భారతీయులే ఉన్నారు. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న భవనం కువైట్‌లోని ఓ అతిపెద్ద నిర్మాణ సంస్థకు చెందినట్లు తెలిసింది. భవనానికి మంటలు అంటుకున్నప్పుడు చాలామంది నిద్రలో ఉన్నారు. దీనివల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగందని అక్కడి స్థానిక అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 40 మందికి పైగా మృతిచెందారని.. మరో 50 మందికి పైగా గాయాలపాలై ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. కువైట్‌లో ఉన్న భారతీయ రాయబారి ఘటనాస్థలాన్ని సందర్శించారని.. బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఈ ప్రమాదంపై కువైట్ అధికారుల నుంచి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ప్రధాని మోదీ కూడా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. భారతీయ రాయబారి ఈ ప్రమాదంపై పర్యవేక్షిస్తోందని.. బాధితులకు అండగా ఉంటుందని తెలిపారు. ఇదిలాఉండగా.. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది.. ‘ది క్వింట్’ కథనంలో సంచలన విషయాలు..