Haldwani : ఉత్తరాఖండ్(Uttarakhand) లో చెలరేగిన హింసాత్మక ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. తాజాగా నైనిటల్ జిల్లా హల్ద్వాని(Haldwani) లో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదులను కూల్చివేశారు. దీంతో అక్కడి స్థానికులు అల్లర్లకు పాల్పడ్డారు. మదర్సా, మసీదును కూల్చివేసేందుకు వచ్చిన పోలీసు సిబ్బంది, మున్సిపల్ కార్మికులపై రాళ్లు విసిరారు. పలు వాహనాలను, ఏకంగా ఓ పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టేశారు. ఈ ఘటన జరిగిన అనంతరం అధికారులు అక్కడ కర్ఫ్యూని విధించారు. అంతేకాదు అల్లరి మూకలు కనిపిస్తే కాల్చివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే గాయాలపాలైన 100 మందికి పైగా పోలీస్ సిబ్బంది, మున్సిపల్ వర్కర్లని ఆస్పత్రికి తరలించారు.
Also Read:వేసవి రాకముందే మండిపోతున్న ఎండలు.. 40 డిగ్రీలకు చేరవలో ఉష్ణోగ్రతలు..
అక్రమంగా నిర్మించారు
అధికారులు తెలిపిన ప్రకారం.. హల్ద్వానిలోని బన్‌భూల్‌పుర ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో కొంతమంది కలిసి మదర్సా(Madrassa) తోపాటు మసీదు(Masjid) ను అక్రమంగా నిర్మించారు. దీంతో వీటిని తొలగించాలని గతంలోనే అధికారులు నిర్వాహకులకు నోటీసులు పంపించారు. కానీ వీళ్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో గురువారం కోర్టు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు పోలీస్ బందోబస్తు నడుమ మదర్సా, మసీదులను కూల్చివేసేందుకు రంగంలోకి దిగారు. వారు అక్కడికి రాగానే స్థానికులు అడ్డుకుని నిరసన తెలిపారు.
హై అలర్ట్
కానీ అధికారులు బుల్డోజర్లతో మదర్సాను కూల్చివేయించారు. దీంతో కొందరు ఆందోళనకారులు అధికారులు, మున్సిపల్ వర్కర్లు, పోలీస్ సిబ్బందిపై రాళ్లు విసిరారు. గాయాలపాలైన వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ హింసాత్మక ఘటన జరిగిన అనంతరం రాష్ట్రావ్యాప్తంగా ఉత్తరాఖండ్ సర్కార్ హై అలర్ట్‌ను జారీ చేసింది. నైనిటాల్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అలాగే పాఠశాలలు, కాలేజీలను, దుకాణాలను మూసివేశారు
కఠినంగా చర్యలు తీసుకోవాలి
ఉత్తరాఖండ్ రాజధాని అయిన దెహ్రాదూన్‌లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి(Pushkar Singh Dhami).. చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో హల్ద్వానిలో జరిగిన ఘటనపై సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్కరు సామరస్యాన్ని పాటించాలని కోరారు. ఇలాంటి హింసాత్మక ఘటనలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
Also Read : ఫేస్‌బుక్ లైవ్‌లో మర్డర్.. కార్పోరేటర్ ను కాల్చి చంపిన ఉద్యమకారుడు