Telangana: తెలంగాణలో 29 వరద ప్రభావిత జిల్లాలు‌‌–సీఎస్ శాంతికుమారి

తెలంగాణలో 29 జిల్లాలను వరద ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు సీఎస్ శాంతి కుమారి. వీటికి ఒక్కో జిల్లాకు పునరావాస చర్యల కింద మూడు కోట్ల చొప్పున ఇవ్వనున్నామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల మినహా అన్ని జిల్లాలు ఇందులోకి రానున్నాయి.

New Update
Praja Palana Application : ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీపై సీఎస్ కీలక ఆదేశాలు

CS Santhi Kumari: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ప్రభావితమైన 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఇప్పటికే నాలుగు జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించి వెంటనే తగు సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు నిధులను సంబంధిత జిల్లా కలెక్టర్లకు విడుదల చేశామని తెలిపారు. అదేవిధంగా మిగిలిన 25 జిల్లాలకు మూడు కోట్ల రూపాయల చొప్పున సంబంధిత జిల్లా కలెక్టర్లకు నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై సవివర నివేదికను సోమవారం మధ్యాహ్నం లోగా సమర్పించాలని కోరుతూ నేడు రాత్రి జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ శాంతి కుమారి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, వికాస్ రాజ్ లతోపాటు పలువురు ముఖ్య కార్య దర్శులు, కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీల మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల నమోదైన వర్షపాతం ఆధారంగా ఈ 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటించినట్టు వెల్లడించారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల మినహా అన్ని జిల్లాలను వర్ష ప్రభావిత జిల్లాలుగా ప్రకటించినట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈ జిల్లాలకు వెంటనే తగు తక్షణ పునరావాస చర్యలను చేపట్టేందుకు జిల్లాకు మూడు కోట్ల రూపాయలను విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని ఆమె స్పష్టం చేశారు. SDRF నియమ నిబంధనలను అనుసరించి ఈ నిధులను వ్యయం చేయాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై, చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు, అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నాడు ఉన్నతస్థాయి సమావేశాన్నిఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వరదలు వర్షాల జరిగిన నష్టాల వివరాలను నిర్ణీత నమూనాలో సమర్పించేందుకుగాను జిల్లాల వారీగా సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 29 మంది మరణించారని వీరికి ఎక్స్ గ్రేషియా అందించేందుకు వివరాలు పంపాలని తెలిపారు. జిల్లాల వారీగా జరిగిన పంట నష్టం, పాడి పశువుల మరణాలు, ఇతర వ్యవసాయ సంబంధిత నష్టాల వివరాలతో పాటు దెబ్బతిన్న రాష్ట్ర, జిల్లా, పంచాయతీ రహదారుల వివరాలు, దెబ్బతిన్న కల్వర్టులు బ్రిడ్జిలు, పాఠశాల భవనాలు, తాగునీటి సరఫరా పైప్ లైన్ ల వివరాలతో కూడిన నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.

Also Read: Hyderabad: పూజలందుకోవడానికి సిద్ధమైన ఖైరతాబాద్ సప్తముఖశక్తి గణేశుడు

Advertisment
తాజా కథనాలు