Minister Uttam Kumar Reddy: పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అవుతాయని, తెలంగాణలో ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ గెలవదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఉత్తమ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ వద్దకు వస్తారని కేసీఆర్ చెప్పడం కామెడీగా ఉందన్నారు.
ALSO READ: కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ కీలక నేత.. క్లారిటీ!
త్వరలో బీఆర్‌ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్కు 15 ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు రావడం కూడా కష్టమేనని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి ఉండదని చెప్పారు. ఆ పార్టీ గురించి మాట్లాడడం వేస్ట్ అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.
బీజేపీతో తెలంగాణకు నష్టం
బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసేందేమీ లేదని, గత పదేళ్లలో మతతత్వ రాజకీయం చేసి మతాల మధ్య చిచ్చుపెడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్యలో జరుగుతాయని అన్నారు. మోదీ ప్రభుత్వంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. రైతుల పంటకు మద్దతు ధర కల్పించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. ఓట్లను అడిగే హక్కు బీజేపీకి లేదని మండిపడ్డారు. ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. బీజేపీ ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడుతోందని మండిపడ్డారు. బీజేపీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, అప్పుల పాలు చేసిందని విమర్శించారు.