Minister Komatireddy Venkat Reddy: లోక్ సభ ఎన్నికల వేళ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5న బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు. అలాగే ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీలు తనతో టచ్‌లోకి వచ్చారని బాంబ్ పేల్చారు. త్వరలోనే వారు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని అన్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత కారు ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.
రాముడి పేరుతో రాజకీయం..
లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి. హిందువుల ఓట్ల కోసం మైనారిటీలను టార్గెట్ చేస్తారా? అని నిలదీశారు. ఓ మతాన్ని టార్గెట్ చేస్తే జరగరానిది జరిగితే ఎవరు ఏం చేయలేరని అన్నారు. బీజేపీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని అన్నారు. ఈ బీజేపీ పార్టీ హయాంలో పేదవాడు బతకడం చాలా కష్టమైందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని.. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాదిస్తుందని పేర్కొన్నారు.
కేసీఆర్ వేస్ట్..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి ఓ జర్నలిస్ట్ ప్రశ్న అడగగా.. కేసీఆర్ గురించి మాట్లాడి వేస్ట్ అని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐదు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలలో వాస్తవం లేదని అన్నారు. కేసీఆర్ ను సీఎం పదవి నుంచి దించి విశాలమైన ప్రగతి భవన్ నుంచి నందినగర్ లోనే అతని సొంత నివాసానికి పంపిన తరువాత కేసీఆర్ కు ఏంచేయాలో తోచడం లేదని అందుకే కాంగ్రెస్ పై లేని పోనీ అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతుందని వ్యాఖ్యానించారు.