Bihar :దేశ రాజకీయాలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. ఇటీవలే జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో బస చేసి వెళ్లగానే బిహార్ నుంచి 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ మేరకు బిహార్‌లో కొత్తగా కొలువుదీరిన జేడీయూ-బీజేపీ (JDU-BJP) సంకీర్ణ ప్రభుత్వం అక్కడి అసెంబ్లీలో ఫిబ్రవరి 12న బలనిరూపణ చేసుకోవాల్సివుంది. ఈ నేపథ్యంలో బిహార్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో పట్నా నుంచి హైదరాబాద్‌కు తరలించింది అధిష్టానం.
12 వరకు ఇక్కడే..
ఈ మేరకు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రముఖ రిసార్టుకు వాళ్లను తరలించగా.. ఈనెల 12 వరకు బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసార్టులోనే ఉంచాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు వాళ్లను ఇతరులు కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇండియా కూటమి నుంచి నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమిలోకి వెళ్లారు. బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులుండగా ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సివుంది. ఎన్డీఏ కూటమిలోని బీజేపీకి 78, జేడీయూకు 45, హిందూస్థాన్ అవామీ మోర్చాకు నలుగురు ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం పార్టీల వారీగా ఆర్జేడీకి 79 మంది, బీజేపీకి 78 మంది, జేడీయూకు 45, కాంగ్రెస్ కు 19, లెఫ్ట్ పార్టీలకు 16, హెచ్ఏఎంకు నలుగురు, ఎంఐఎంకు ఒకరు, ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. ఇక ఇక్కడకు వచ్చిన ఎమ్మెల్యేల బాధ్యతను ఏఐసీసీ సెక్రటరీ సంపత్, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Fighter: అప్పుడు ఓకే అని ఇప్పుడు కేసులా.. ముద్దు సీన్ ఇష్యూపై డైరెక్టర్ అసహనం
శ్రీశైల క్షేత్ర దర్శనం..
ఇదిలావుంటే బీహార్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు 19 మంది శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. బుధవారం శ్రీశైల క్షేత్రం చేరుకున్న వీరికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏఈవో మోహన్, వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో తిలకధారణ చేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్బాలయంలో పంచామృత అభిషేకములు, బిల్వార్చన చేసుకుని అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేసుకుని హారతులు అందుకున్నారు. ఆలయంలోని పరివార దేవతలను దర్శించుకున్న తర్వాత ప్రాకార మండపంలో వేదాశీర్వచనాలు వల్లించిన ప్రధానార్చకులు అభిషేక జల తీర్థప్రసాదాలు, స్వామిఅమ్మవార్ల ఙ్ఞాపికను అందజేశారు.