బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కిషోర్‌గంజ్ అనే జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న రైలును సరకు రవాణా రైలు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులను పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కిషోర్‌గంజ్‌లోని భైరబ్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం 3.30 PM గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకాకు వెళ్తున్న ఎగరో సింధూర్ అనే ఎక్స్‌ప్రెస్‌ను ఛటోగ్రామ్ వైపు వెళ్తున్న మరో సరకు రవాణా రైలు వెనక నుంచి ఢీకొట్టిందని భైరబ్ రైల్వే పోలీసులు తెలిపారు.
అయితే ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 20 మృతదేహాలను బయటికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఫైర్ సర్వీసెస్ అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. ఈ దుర్ఘటనలో ధ్వంసమైనటువంటి కోచ్‌లల కొంతమంది ప్రయాణికులు ఇరుక్కుపోయినట్లు ఢాకాకు చెందిన పలు వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ధ్వంసమైన రైలు కోచ్‌లను తొలగించేందుకు క్రేన్లను తరలించారు అధికారులు.
Also Read: జైల్లో నవరాత్రి ఉత్సవాలు.. దాండియా ఆడిన మహిళా ఖైదీలు..