ఢిల్లీలో సోమవారం సాయంత్రం బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇలాంటి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొత్తం 16 విమానాలను దారి మళ్లించినట్లు ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ విమానాలను సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య మళ్లించామని పేర్కొన్నారు. జైపూర్‌కు పది, లక్నోకు మూడు, అమృత్‌సర్‌కు రెండు, అహ్మదాబాద్‌కు ఒక విమానాన్ని పంపినట్లు చెప్పారు. మరోవైపు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమాన ట్రాఫిక్ వల్ల కార్యకలాపాలు దెబ్బతిన్నాయని ఇండిగో ఎయిర్‌లైన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. అయితే ఇప్పటికే కాలుష్య కొరల్లో చిక్కుకున్న ఢిల్లీలో వర్షాలు కురవడం వల్ల కాలుష్యం కొంతవరకు తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఢిల్లీలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలాఉండగా.. బంగాళఖాతంలోని దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.