Japan Earth Quake Updates : సోమవారం (January 1) న్యూ ఇయర్ సందర్భంగా సెంట్రల్ జపాన్‌లోని పశ్చిమ తీరంలో ఇషికావా (Ishikawa) ప్రిఫెక్చర్‌లోని నోటో ద్వీపకల్పం సమీపంలో, ప్రజలు వేడుకల కంటే భయాందోళనలో మునిగిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:10 గంటలకు 7.6 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం (Earth Quake) సంభవించింది. భూకంపం కారణంగా అనేక భవనాలు నేలమట్టం కాగా, పలు ఇళ్లు కూలిపోయాయి. చాలా చోట్ల రోడ్లు తెగిపోగా, తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరిక (Tsunami warning)లు జారీ చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ శిథిలాల కింద ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకునే అవకాశం ఉంది. సునామీ హెచ్చరికలతో ఆ ప్రాంత వాసులను తమ ఇళ్లను ఖాళీ చేయాలని హెచ్చరించారు. ప్రజలను సురక్షిత శిబిరాల్లో ఉంచుతున్నారు. జపాన్ (Japan)కు వెళ్లే పౌరులకు భారతదేశం కూడా ఒక సలహా జారీ చేసింది.
సోమవారం కొత్త సంవత్సరం సందర్భంగా జపాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి . 7 గంటల్లో 60కి పైగా భూకంపాలు (More than 60 earthquakes) భారీ విధ్వంసం సృష్టించాయి. అయితే, ఇంతకుముందు భారీ సునామీ హెచ్చరిక జారీ చేశారు.అయితే అదృష్టం కొద్దీ పెద్ద సునామీ రాలేదు. ప్రజలను వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సహాయక శిబిరాలకు తరలించారు. ప్రస్తుతం, అనేక బృందాలు రెస్క్యూ, రిలీఫ్ పనుల కోసం నిమగ్నమై శిధిలాలను తొలగిస్తున్నారు. వర్షం, బలమైన గాలుల కారణంగా సహాయక చర్యలకు కూడా అంతరాయం కలుగుతోంది.
భూకంపం తర్వాత నగరంలోని అనేక ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి:
జపాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, భూకంపం కారణంగా, నోటో ద్వీపకల్పంలోని నానోలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. హోన్షు ద్వీపంలోని తీర ప్రాంతమైన వాజిమా, ఇషికావా ప్రిఫెక్చర్‌లో ఆరుగురు వ్యక్తులు మరణించారు. భూకంపం తర్వాత నగరంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. బలమైన గాలులు, అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని స్వల్ప భూకంపాలు వచ్చే అవకాశం ఉందని అక్కడి వాతావరణంశాఖ తెలిపింది.
ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకున్న అలలు:
భూకంపం కారణంగా, ఇషికావా ప్రిఫెక్చర్‌లో ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న సునామీ అలలు తీరాన్ని చేరుకున్నాయి. అలలు మొదట్లో 5 మీటర్లు (16 అడుగులు) వరకు చేరుకుంటాయని భావించారు కానీ దాని కంటే చాలా చిన్నవిగా ఉన్నాయి. 2011 సునామీ నోటో ప్రాంతంలో భారీ విధ్వంసం సృష్టించింది. 18,000 మంది మరణించారు. పొరుగున ఉన్న నీగాటా, టొయామా ప్రావిన్సులకు కూడా సునామీ హెచ్చరిక జారీ చేశారు. 51,000 మందిని వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సమీపంలోని ఎత్తైన ప్రాంతాలకు తరలించారు.
జపాన్ భారీ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు.. జపాన్ ప్రజలను మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే.. భూకంపం వస్తున్నా.. వారు ధైర్యంగా ఉన్నారని.. తమ ప్రాణాలను లెక్కచెయ్యకుండా వీడియోలు తీస్తున్నారని నెటిజన్లుకామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆల్కహాల్, సిగరేట్ తాగుతున్నారా? జరభద్రం…ఆ రిస్క్ తప్పదంటున్న వైద్యులు..!!