Virus: మానవాళికి మరో ముప్పు.. చైనాలో బయటపడ్డ 125 వైరస్‌లు

చైనాలోని ఫర్ ఫార్మ్‌లలో ఉన్న జంతువుల్లో 125 రకాల వైరస్‌లను ఓ పరిశోధన బృందం గుర్తించింది. ఇందులో 39 వైరస్‌లు ఇతర జాతి జంతువులకు సోకే అవకాశముందని.. తద్వారా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉన్నట్లు వారి పరిశోధనలో తేలింది.

New Update
Virus: మానవాళికి మరో ముప్పు.. చైనాలో బయటపడ్డ 125 వైరస్‌లు

నాలుగేళ్ల క్రితం చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల పలు జంతువులపై నిర్వహించిన ఓ సర్వే తమ నివేదికలో సంచలన విషయాలు బయటపెట్టింది. చైనాలోని ఫర్ ఫార్మ్‌లలో ఉన్న జంతువుల్లో 125 రకాలు వైరస్‌లు ఉన్నట్లు గుర్తించింది. ఇందులో కొన్ని వైరస్‌లు మానవులకు కూడా సోకే ప్రమాదం ఉందని పేర్కొంది. వీటిపై సర్వే జరిపిన చైనా పరిశోధకులు.. ఫర్‌ ఫార్మ్‌లలో వైరస్‌లను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ పరిశోధనలో గతంలో గుర్తించని 36 కొత్త వైరస్‌లు కూడా బయటపడ్డాయి. మొత్తంగా బయటపడ్డ వైరస్‌లలో 39 వైరస్‌లు ఇతర జాతి జంతువులకు సోకే అవకాశముందని.. తద్వారా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని గుర్తించారు.

నేచర్‌ అనే జర్నల్‌లో ఈ సర్వేకి సంబంధించిన వివరాలు ప్రచురించారు. 2021 నుంచి 2024 వరకు ఈ పరిశోధన జరిగింది. వివిధ రకాల వ్యాధుల వల్ల చనిపోయిన 461 రకాల జంతువులను పరిశీలించారు. ఇందులో ఫర్‌ ఫార్మ్‌ల నుంచి తీసుకొచ్చిన నక్కలు, రక్కూన్ కుక్కలు, కుందేళ్లు లాంటి జంతువులతో పాటు మిగతా జంతువులపై పరిశోధనలు జరిపారు. అంతేకాదు ఇందులో 50 అడవి జంతువులు కూడా ఉన్నాయి. గుర్తించిన వైరస్‌లలో హెపటైటిస్-ఈ, జపానిస్ ఎన్సెఫాలిటిస్ లాంటి తెలిసిన వైరస్‌లతో పాటు 13 కొత్త వైరస్‌లు ఫర్‌ పార్మ్‌లలో ఎక్కువగా వ్యాపిస్తున్నాయని పరిశోధకులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఫర్ ఫార్మ్‌ ఇండస్ట్రీని మూసివేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ వైరాలజిస్ట్ ఎడ్వార్డ్ హోల్మ్స్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వైరస్‌లను నివారించేందుకు ఫర్‌ ఫార్మ్‌లను పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Also Read: అంబులెన్స్‌లో ఘోరం.. పేషెంట్ భార్యపై డ్రైవర్ లైంగిక దాడి!

అంతేకాదు పరిశోధకులు ఈ జంతువుల్లో ఏడు రకాల కరోనా వైరస్‌లను కూడా గుర్తించారు. అయితే కోవిడ్-19కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్‌తో వీటికి దగ్గరి సంబంధం లేదు. ఇక రక్కూన్ కుక్కలు, మింక్‌లు ప్రమాదకర వైరస్‌లకు గురవుతున్నాయని ఈ సర్వేలో తేలింది. ఇలాంటి వైరస్‌లే మానవులకు సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా 2021లో చైనా ఏకంగా 2.7 కోట్ల జంతువుల నుంచి వాటి చర్మాలను సేకరించింది. వీటితో లగ్జరీ వస్త్రాలను తయారు చేశారు. ఇప్పుడు వీటివల్ల కూడా ఏదైనా ముప్పు పొంచే అవకాశం ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఫర్ ఫార్మ్‌లలో ఉండే జంతువలపై.. ముఖ్యంగా మింక్, రక్కూన్ డాగ్స్, గినియా పందులు వంటి జంతు జాతులపై పర్యవేక్షణను మరింత పెంచాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం ఆసియాలో ఫర‌ ఫార్మ్‌లు పెరుగుతున్నాయి. దీంతో భవిష్యత్తు మహమ్మారిలను నివారించేందుకు ఈ ఫార్మ్‌లపై కఠినమైన నిబంధనలు విధించాలని.. పర్యేవేక్షణ వ్యవస్థలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. లేకుంటే వీటివల్ల ఇతర మహమ్మారి వైరస్‌లు కూడా బయటపడే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.

Also read: 8 గంటలు రిస్క్ తీసుకుని 82 మందిని కాపాడిన సబ్ కలెక్టర్!

Advertisment
తాజా కథనాలు