Nile River : ఈజిప్టు(Egypt) రాజధాని సమీపంలోని నైలు నది(Nile River) లో పడవ మునిగిపోవడం(Ferry Sink) తో అందులో ఉన్న 15 మందిలో 10 మంది మరణించారు. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలతో బయటపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు మానవశక్తి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అనంతరం వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, పడవ మునిగిపోవడానికి కారణం తెలియలేదు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఈజిప్షియన్ పౌండ్లు (దాదాపు 6,466 డాలర్లు) , గాయపడిన వారికి 20 వేల ఈజిప్షియన్ పౌండ్లు (సుమారు 646 డాలర్లు) పరిహారాన్ని మంత్రిత్వ శాఖ అందించింది.
రోజువారీ కూలీలు స్థానిక నిర్మాణ సంస్థలో పని చేసేందుకు పడవలో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతదేహాలను గుర్తించేందుకు రెస్క్యూ సిబ్బందికి గంటల తరబడి పట్టిందని చెప్పారు. ఈ ఘటన గిజాలోని మోన్‌షాత్-అల్-కనాటర్ నగరంలో చోటుచేసుకుంది. గ్రేటర్ కైరో(Greater Cairo) లోని మూడు ప్రావిన్సులలో గిజా ఒకటి.
రెస్క్యూ బృందాలు బాధితుల మృతదేహాలను వెలికితీయడంలో సవాళ్లను ఎదుర్కొన్నాయి. సెర్చింగ్ ఆపరేషన్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది. రవాణా కోసం పడవలపై ఆధారపడే ఈజిప్షియన్లు ముఖ్యంగా ఎగువ ఈజిప్ట్, నైలు డెల్టా వంటి ప్రాంతాలలో రోజువారీగా ఎదుర్కొనే ప్రమాదాలను ఈ సంఘటన మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.
Also Read : మూతపడిన థియేటర్ ను మల్టీప్లెక్స్ గా మార్చబోతున్న సూపర్ స్టార్!