YS Sharmila: విజయవాడ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. RTVతో ఆమె మాట్లాడుతూ.. ఏపీలో ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ ఏమీ పట్టనట్లుగా ఉన్నారని విమర్శించారు. వరదల్లో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట నష్టం జరిగిన రైతుకు ప్రతి ఎకరాకు రూ. 25,000 పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టాలని.. కొంతమందికి మాత్రమే సహాయక చర్యలు అందుతున్నాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సహాయం చేసేలాగా ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు.
Also Read: సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటి? ఎలా డొనేట్ చేయాలి?
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరదను పరిశీలించిన షర్మిల.. పడవల దాటికి విరిగిపోయిన గేట్లను పరిశీలించారు. పడవలను కావాలనే వదిలారా ? అనే అనుమానం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులు ఎవరో గుర్తించి.. కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీకి ఇది సామాన్యమైన దెబ్బ కాదని.. జగన్ హయాంలో అసలు బ్యారేజీలకు, ప్రాజెక్టులకు సరైన నిర్వహణ లేదని మండిపడ్డారు.