YCP MP Vijay Sai Reddy raised question about Coastal States Fund in Rajya Sabha: రాజ్య సభలో(Rajya Sabha) ప్రశ్నోత్తరాల సమయంలో కోస్తా రాష్ట్రాలకు సంబంధించి పలు అంశాలపై కేంద్రాన్ని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి(MP Vijay Sai Reddy) ప్రశ్నించారు. కోస్తా ప్రాంతాల్లో తుఫాన్ వల్ల సంభవించే విపత్తును ఎదుర్కొనేందుకు ఎఫ్పటికప్పుడు ప్రణాళికలను సవరిస్తున్నారా ? అని అడిగారు. కోస్తా రాష్ట్రాలు తరుచూ వరద బారిన పడుతుంటాయని, ఆయా రాష్ట్రాలకు సహాయపడేలా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే ఆలోచన ఏదైనా కేంద్రం వద్ద ఉందా అని ప్రశ్నలు వేశారు.
వరదల సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, బాధితులకు సకాలంలో వైద్య సాయం అందించడం, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం చేసుకుంటూ పనులను సమర్ధంగా నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారా అని ప్రశ్నలు గుప్పించారు. విజయ్ సాయి రెడ్డి ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మౌఖికంగా బదులిచ్చారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా 2021-26 లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు(NDRF) రూ. 1,60,153 కోట్లను కేటాయించామన్నారు. గతంలోని కేటాయిపులతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు అధికమన్నారు. దీంతో పాటు మరో రూ. 68 వేల కోట్లతో తక్షణ సహాయ నిధిని ఏర్పాటు చేశామన్నారు.
కోస్తా రాష్ట్రాల్లో తుపాన్లు సంభవించినపుడు ఎన్డీఆర్ఎఫ్(NDRF), ఐఎండీ(IMD), సీడబ్ల్యుసీతో(CWC) పాటు వివిధ ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ విపత్తు సహాయ చర్యలను కేంద్రం చేపడుతోందన్నారు. అలాగే కోస్తా రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు ద్వారా సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.