YCP MP Sri Krishnadevaraya vs YCP MLA Vidadala Rajini: వాళ్ళిద్దరూ తొలిసారి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు... ఒకరేమో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు... మరొకరు ఎంపీగా గెలిచారు.. అయితే ఇద్దరిమధ్య విబేధాలు పీక్ స్టేజీకి చేరాయి... ఏకంగా మినిస్టర్ ను టార్గెట్ చేస్తూ ఆ ఎంపీ చేసిన ప్రయత్నం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి రజిని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మధ్య విభేదాలు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి మంత్రి రజినితో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు సఖ్యత లేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు చిలకలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ నుమొదటినుంచి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇదే మంత్రి రజిని ఎంపీ మధ్య విభేదాల కారణమైంది. తర్వాత ఎంపీ, మంత్రి వర్గాల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడం నియోజకవర్గంలో రొటీన్ గా మారాయి. ఎంపీ కనీస సమాచారం లేకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ మంత్రి రజిని వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఈ నేపథ్యంలోనే నాలుగైదు సార్లు ఎంపీ, మంత్రి వర్గాలు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయు.
సైలెంట్ గా ఉన్నా మళ్లీ పోరు స్టార్ట్:
కొంతకాలం సైలెంట్ గా ఉన్నా మళ్లీ మంత్రి ఎంపీల మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో మైనారిటీ నేత జాన్ సైదాను అడ్డం పెట్టుకొని రాజకీయాలు మొదలయ్యాయి. దీని వెనక ఎంపీ ఉన్నారని మంత్రి రజిని వర్గీయుల ఆరోపణ. ఇదే సమయంలో నాలుగు రోజుల క్రితం పల్నాడు జిల్లా వైసీపీ సమీక్షా సమావేశం జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి సమీక్షలో మంత్రి రజినిపై కొంతమంది వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. అయితే దీని వెనక ఎంపీ ఉన్నారని మంత్రి అనుచరులు అనుమానిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా అసమ్మతి వర్గీయులు హడావుడి మొదలుపెట్టారు.
ఎంపీ విజయసాయిరెడ్డిని కలవాలంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న మంత్రి అనుచరులు కూడా వీరిపై అసహనం వ్యక్తం చేశారు. చివరకు అసమ్మతి నేతలు ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి మంత్రి రజిని తమను కలుపుకొని పోవడం లేదని... వర్గాల ప్రోత్సహిస్తుందంటూ ఆరోపించారు. ఇదే సమయంలో మరి కొంతమంది చేసిన ఆరోపణలపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.
కావాలనే మంత్రి రజిని టార్గెట్ చేశారు:
అయితే సమీక్షా సమావేశం జరుగుతున్న హాలు వద్దకు అసమ్మతి నేతలు రావడం, ఎంపీ విజయసాయిరెడ్డితో తనపై ఫిర్యాదు చేయడం వెనక ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కీలక పాత్ర పోషించినట్లు మంత్రి వర్గీయులు అనుమానిస్తున్నారు. చిలకలూరిపేటలో కొంతమంది నేతలను గ్రూపులుగా తయారుచేసి మంత్రిని టార్గెట్ చేసేలా ఎంపీ ప్రయత్నిస్తున్నారని రజిని అనుచరులు ఆరోపిస్తున్నారు. తన నియోజకవర్గంలో ఎంపీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్, ఎంపీ తీరుపై నేరుగా సీఎం జగన్ కు ఫిర్యాదు చేసేందుకు మంత్రి రజిని రెడీ అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇద్దరిమధ్య విబేధాలు పెరగడంతో పార్టీ పెద్దలు కూడా వివాదాలపై దృష్టి సారించారు. మరి పార్టీ పెద్దలు ఇద్దరు నేతలమధ్య విబేధాలను ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి: YCP vs TDP: నట సింహానికి చెక్ పెట్టేదెవరు? వైసీపీ వేసిన స్కెచ్ ఏంటి?