YCP MLC Vamshi Krishna: ఎన్నికలు (AP Elections) దగ్గర పడుతున్న వేళ ఏపీలో జంపింగ్ లు స్టార్ట్ అయ్యాయి. ఉన్న పార్టీలో టికెట్ దక్కదన్న నిర్ణయానికి వచ్చిన వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలో అభ్యర్థుల మార్పును చేస్తుండడంతో అసంతృప్తిగా ఉన్న కొందరు టీడీపీ, జనసేనలోకి వేళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వంశీ కృష్ణ జనసేన పార్టీలో (Janasena) చేరుతున్నారంటూ స్థానికంగా వాట్సాప్ మెసేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ సీనియర్ నేతగా ఉన్న వంశీ కృష్ణ పార్టీ మారే ఆలోచనతో ఉన్నట్టు అనుచరుల దగ్గర చెప్పినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
Also Read: వారికి జీతాలు పెంపు.. ఉద్యోగులపై టీటీడీ వరాల వర్షం!
ప్రస్తుతం ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఉన్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన వంశీకృష్ణ ఈ సారి ఎలాగైనా పోటీ చేసి విజయం సాధించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 27వ వార్డు కార్పొరేటర్ గా పోటీ చేసి మేయర్ పదవి ఆశించి భంగపడ్డారు. గాజువాక నుంచి వైసీపీ అధ్యర్థిగా పోటీ చేయాలని వంశీని గతంలో వైసీపీ పెద్దలు కోరినట్లు తెలుస్తోంది.
అయితే వంశీ మాత్రం విశాఖ తూర్పు టికెట్ ఇవ్వాలని కోరారు. ఇందుకు వైసీపీ అధిష్టానం నో చెప్పడంతో పార్టీ మారే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఫ్యామిలీ తో వంశీకి మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో ఆయన టీడీపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కుదరకపోతే జనసేనలోకి అయినా వెళ్లి పొత్తుల్లో భాగంగా టీడీపీ (TDP) మద్దతుతో పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.