Botsa Satyanarayana: మంగళవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన మాట్లాడుతూ.. రానున్న శాసన మండలి ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు.
నర్సీపట్నం లో మాజీ శాసన సభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపల్ కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో వైసీపీకి 644 మంది కి పైగా సభ్యుల సంఖ్యా బలం ఉందని, నర్సీపట్నం నియోజకవర్గంలో 88 మంది ఓటర్లు ఉండగా వైసీపీకి 64 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. వైసీపీ గుర్తుపై గెలిచిన మీరంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి తన విజయానికి కృషి చేయాలని కోరారు.
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల తరువాత జరగనున్న శాసనమండలి ఎన్నిక గొప్ప మలుపునకు నాంది కాబోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణ రాజు, వైసీపీ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు, నియోజకవర్గంలోని ఎంపీటీసీలు జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Also Read: వైసీపీ నాకు శత్రువు కాదు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!