Manda Krishana: ఏపీలో కూటమి అధికారంలోకి వస్తేనే మాదిగ జాతికి మేలు జరుగుతుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎన్డీఏ కూటమి పోటీ చేసే ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. టీడీపీ రాజకీయంగా మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చిందని, వైసీపీ ఏమీ మేలు చేయలేదని, అందుకే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నామని తెలిపారు.
పూర్తి సహకారం అందిస్తాం..
ఈ మేరకు సోమవారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నేతలతో మంద కృష్ణ మాదిగ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా ఉద్యమానికి సహకరిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మే13న జరిగే ఎన్నికల చివరి రోజు వరకు మాదిగలు పూర్తి సహకారం అందిస్తారన్నారు. మాదిగ జాతి భవిష్యత్తు కూటమి గెలుపుతో కూడుకున్నది. కూటమి గెలుపు ఎమ్మార్పీఎస్ సవాల్ గా తీసుకొని పనిచేస్తుందన్నారు. 175అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్థులు గెలుపుకోసం అహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే మాదిగల భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది. మాదిగల సంక్షేమానికి కూటమి గెలుపు అనివార్యం. సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే కూటమి గెలుపుకోసం మాదిగలు పోరాటం చేయక తప్పదు. జగన్ ను ఏపీలోని మాదిగలు ప్రధమ శత్రువుగా ప్రకటించారు. షెడ్యూలు కులాలు వర్గీకరణ విషయంలో జగన్ మాదిగలకు మొండిచేయి చూపారు. గత 5 సంవత్సరాలుగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యతనుకోల్పోయారు. రాజకీయంగా వైసీపీ అణగదొక్కిందని ఆరోపించారు.
జగన్ సర్వనాశనం చేశాడు..
షెడ్యూలు కులాల వర్గీకరణకు మొండిచేయి చూపి, మాదిగల విషయంలో హాని చేసి సర్వనాశనం చేసిన జగన్ ను ఓడించేవరకు వదిలిపెట్టమన్నారు. ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి జగన్ పూర్తి వ్యతిరేకి. కూటమి గెలుపు మాదిగల మలుపు. అణగారిన వర్గాలను అణగదొక్కడంలో జగన్ ప్రభుత్వం ప్రధమ స్థానంలో ఉండటం దారుణం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి అణగారిన వర్గాల ఆశలను, అభివృద్ధిని చిన్నాభిన్నం చేసింది. నవరత్నాల పేరుతో దళితులను అట్టడుగు స్థాయికి చేర్చిన ఘనుడు జగన్. పేదల అందాల్సిన పధకాలను ఎవ్వరికీ అందకుండా చేసి చిట్టచివరకు సబ్ ప్లాన్ నిధులను సైతం పక్కదారి పాటయించి సర్వనాశనం చేసాడు. ఎన్ డి ఏ కూటమి ప్రధాన అభ్యర్థి వర్గీకరణకు పూర్తి సహకారం అందించడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.