Yarlagadda Venkata Rao Sensational Decision resigned YSRCP: వైసీపీకి గుడ్ బై చెప్పారు గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని మీడియా ముందు వాపోయారు. వైసీపీలో ఉండగా ఒక్కసారి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలేదన్నారు. కలిశానని ముఖ్యమంత్రి నమ్మితే అది ఇంటిలిజెన్స్ వైఫల్యమేనని యార్లగడ్డ పేర్కొన్నారు.
ఇప్పుడు బహిరంగంగా చెబుతున్నా.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరతా అని యార్లగడ్డ తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే గన్నవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను గన్నవరం నియోజకవర్గంలో నుండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మీ ఎదుట కనిపిస్తానని సీఎం జగన్ కి సవాల్ విసిరారు.
సజ్జల మాటలకు నొచ్చుకున్నా
సీఎం జగన్ ను టిక్కెట్ ఇవ్వాలని మాత్రమే తాను కోరానని యార్లగడ్డ చెప్పారు. పార్టీ పెద్దలకు ఏం అర్థమైందో తనకు తెలియదని చెప్పారు. తనను ఎక్కడైనా పార్టీ సర్దుబాటు చేస్తుందని సజ్జల ప్రకటన చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పార్టీలో ఉంటే ఉండు.. పోతే పొమ్మని సజ్జల చెప్పడం వల్ల తనకు చాలా బాధ, ఆవేదన కలిగాయని అన్నారు. టీడీపీ కంచుకోటలో తాను ఢీ అంటే ఢీ అని పోరాడానని గుర్తు చేశారు. ఆ బలమే ఇప్పుడు బలహీనత అయిందా? అని ప్రశ్నించారు. టీడీపీలో గెలిచిన అభ్యర్థిని తెచ్చుకోవడం మీకు బలంగా మారిందా అని నిలదీశారు.
ఇప్పటి వరకూ బాబును కలవలేదు
తడి గుడ్డతో గొంతు కోయడం అనేది తన విషయంలో నిజమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన మనిషిని కాపాడాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుందని అన్నారు. తాను ఇంతవరకు చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ నేతలను కలవలేదని చెప్పారు. తాను టీడీపీ నేతలను కలిసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. మారుతున్న పరిణామాలతో చంద్రబాబును కలవబోతున్నానని పేర్కొన్నారు.
Also Read: గరం గరంగా గన్నవరం రాజకీయం… యార్లగడ్డ సైకిల్ ఎక్కుతున్నారా?