World AIDS Day: నేడు ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఏంటంటే..

ప్రతిఏడాది డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా 'వరల్డ్ ఎయిడ్స్ డే' ను జరుపుకుంటారు. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా 'యూఎన్ ఎయిడ్స్' ఓ థీమ్‌ను ప్రకటించింది. ఈ ఏడాది (2023)కి 'లెట్‌ కమ్యూనిటీస్‌ లీడ్‌ ' అనే థీమ్‌ను ప్రకటించారు.

New Update
World AIDS Day: నేడు ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఏంటంటే..

మొదటిసారిగా 1981 జూన్‌లో బయటపడిన ఎయిడ్స్ వ్యాధి ప్రపంచాన్ని వణికించింది. అప్పటి నుంచి నేటి వరకు ఇంకా ఎయిడ్స్ భూతం అంతం కాలేదు. ఈ 42 సంవత్సరాల్లో 8 కోట్ల 56 లక్షల మంది ఎయిడ్స్‌కు దారితీసే హెచ్‌ఐవీ బారిన పడ్డారు. దాదాపు 4 కోట్ల మంది ఎయిడ్స్ వ్యాధితో మరణించారు. అయితే ప్రతి ఏడాది డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తగా.. 'ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని' జరుపుకుంటారు. ఈరోజున ప్రజలకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించడం, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు జీవితంపై భరోసా ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ ఎయిడ్స్‌ డేకి ఒక థీమ్‌ ఉంటుంది. అయితే ఈ ఏడాది (2023)కి 'లెట్ కమ్యూనిటీస్‌ లీడ్' అనే థీమ్‌ను ప్రకటించారు.

అంటే హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు, హెచ్‌ఐవీకి గురయ్యే ప్రమాదం ఉన్నవారు, ఎయిడ్స్‌ వల్ల తమ వారిని కోల్పోయిన బాధితులు ఇలా ఇలాంటి కమ్యూనిటీస్‌కి చెందినవారు హెచ్‌ఐవీపై అవగాహన కల్పించాలి. అలాగే ఈ కమ్యూనిటీలకు నాయకత్వ పాత్రలు ఇవ్వడం, వారికి నిధులు సమకూర్చడం, హెచ్‌ఐవి సేవలను అందించడంలో కమ్యూనిటీల పాత్రను సులభతరం చేసేలా చేయడం లాంటివి చేయాలి.  ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచంలో వచ్చిన మహమ్మారీలు పరిమిత కాలంలోనే పెను విధ్వంసం సృష్టించి ఆ తర్వాత అంతం అవుతుంటాయి. కానీ ఎయిడ్స్ మాత్రం అలా కాదు. గత 40 ఏళ్లుగా ఇప్పటికీ ఎయిడ్స్‌ వ్యాధికి గురవుతున్నారు. ఎయిడ్స్‌కు కారణమైన హెచ్‌ఐవీ క్రిమి ప్రధానంగా లైంగికంగా వ్యాప్తి చెందుతుంది. వాస్తవానికి ఆ హెచ్‌ఐవీ వ్యాప్తికి అవగాహన లేకపోవడానికి కారణాలు ఏంటంటే.. దీనిపై అవగాహన లేకపోవడం, పేదరికం, ఆరోగ్య వైద్య సదుపాయాల కొరత, చదువు లేకపోవడం. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో హెచ్‌ఐవీ వ్యాధి ఎక్కువగా వ్యాపించింది. 2022 నాటికి ప్రపంచంలో దాదాపు 3 కోట్ల 90 లక్షల మంది ఎయిడ్స్‌తో బాధపడుతున్నారు. అయితే వీళ్లలో 15 లక్షల మంది 15 ఏళ్లలోపు ఉన్నవారే. ప్రపంచవ్యాప్తంగా 2022లో 6 లక్షల 30 వేల మంది ఎయిడ్స్‌ జబ్బుతో మరణించారు. కొత్తగా 17 లక్షల మంది హెచ్‌ఐవీ బారిన పడ్డారు.

దక్షిణాది ఆఫ్రికాలోని బోట్స్‌వానా, ఉగాండా,జింబాబ్వే, జైరి, స్వాజిలాండ్, లాంటి దేశాల్లో హెచ్‌ఐవీ బయటపడిన మొదటి దశకంలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో 40 శాతం మంది హెచ్‌ఐవీకి గురయ్యారు. దీంతో వాళ్లు అనారోగ్యంతో ఫ్యాక్టరీలకు, పనులకు వెళ్లలేకపోయారు. చివరికి ఆయా దేశాలలోని ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. అయితే వైద్యశాస్త్రంలో అనేక కొత్త విధానాలకు హెచ్‌ఐవీ / ఎయిడ్స్‌ దారులు చూపింది. ఒక జబ్బు కోసం పరిశోధనలు చేసి తయారుచేసిన మందును వేరే జబ్బుకు వాడే ప్రక్రియ (రీపర్పసింగ్‌ డ్రగ్‌)ను ముందుగా ఈ హెచ్‌ఐవీ చికిత్సలోనే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జిడోవుడిన్‌గా పిలుస్తున్న అజిడోథైమిడిన్‌ మందును క్యాన్సర్‌ చికిత్స కోసం అభివృద్ధి చేశారు. అయితే జిడోవుడిన్‌ ఔషధం హెచ్‌ఐవీ వృద్ధిలో పాత్ర ఉన్న ఒక ఎంజైము పనిని అడ్డుకొని, అది వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. అందుకే అజిడోథైమిడిన్‌ మందును హెచ్‌ఐవీ మహమ్మారి ప్రారంభమైన ఐదేళ్ల తర్వాత.. 1987 మార్చిలో హెచ్‌ఐవీ చికిత్సకు మొదటి చికిత్సగా ప్రవేశపెట్టారు.

Also Read: తెలంగాణలో కాంగ్రెస్‌దే ఆధిక్యం.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ లెక్కలివే..!

ప్రతి ఏడాది డిసెంబర్ 1న ప్రపంచవ్యా్ప్తంగా హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌ అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం వల్ల హెచ్‌ఐవీ వ్యాప్తిని చాలా వరకు అడ్డుకోగలిగాము. ఎయిడ్స్‌ జబ్బుకి దారి తీసే హెచ్‌ఐవీ క్రిమి ప్రధానంగా ఆ క్రిమి సోకిన వారితో లైంగిక చర్యలో పాల్గొంటే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. హెచ్‌ఐవీ బాధితురాలు అయిన తల్లి నుంచి గర్భంలో ఉన్న శిశువుకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులు, ఎయిడ్స్‌ వల్ల తమ వారిని కోల్పోయిన బాధితులు, హెచ్‌ఐవీకి గురయ్యే ప్రమాదం ఉన్నవారు, ఇలా ఈ సమూహాలకు చెందినవారు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడానికి ముందుండాలని ‘యూఎన్‌ ఎయిడ్స్‌’ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చింది.

Advertisment
తాజా కథనాలు