Pawan Kalyan: బీజేపీతో కలిసి పోటీ చేస్తారా లేదా మద్దతిచ్చి తప్పుకుంటారా.. పవన్ దారెటు..

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. తన కార్యాలయానికి విచ్చేసిన వీరిద్దరికి పవన్‌ కళ్యాణ్‌ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన చర్చల్లో జనసేన తెలంగాణ నేతలు తన వద్ద వెలిబుచ్చిన అభిప్రాయాలను పవన్‌ కళ్యాణ్‌ బీజేపీ నేతలకు వివరించారు. ఈ మీటింగ్‌పై టీబీజేపీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

New Update
Pawan Kalyan: బీజేపీతో కలిసి పోటీ చేస్తారా లేదా మద్దతిచ్చి తప్పుకుంటారా.. పవన్ దారెటు..

నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా... డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. అంటే ఏ పార్టీకి అయినా మిగిలి ఉన్న సమయం గట్టిగా 40 రోజులే. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ బీఆర్ఎస్‌.. ప్రచారంలోనూ అందరికంటే ముందు దూసుకుపోతోంది. మరోవైపు రాహుల్‌, ప్రియాంక రాకతో కాంగ్రెస్ సైతం ప్రచార పర్వాన్ని స్టార్ట్‌ చేసింది. ఇక త్రిముఖ పోరుగా భావిస్తున్న ఎన్నికల్లో మూడో ప్రధాన పోటీదారుగా ఉన్న బీజేపీ సైతం అభ్యర్థుల లిస్ట్‌ ప్రకటించేందుకు రెడీ అయ్యింది. అదే సమయంలో తన మిత్ర పక్షం అయిన జనసేనతో చర్చలు జరుపుతోంది. తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేసే అంశాన్ని మొన్నటిదాకా పెద్దగా సీరియస్‌గా పట్టించుకోని బీజేపీ.. జనసేన అధినేత దూకుడు పెంచడంతో అలర్ట్‌ అయ్యింది. తాజాగా టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో చర్చలు జరిపారు. ఈ భేటీలో తెలంగాణలో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై చర్చించినట్లు జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇద్దరు అధినేతల భేటీకి ముందు సీన్‌ ఏంటంటే..
ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. మరోవైపు ఎన్డీయే కూటమిలోనూ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన పార్టీ ఏపీ శాఖ ప్రధాన కార్యాలయంలో పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో అత్యవసరంగా భేటీ అయ్యారు పవన్‌ కళ్యాణ్‌. ఆ భేటీ ముగించుకుని అదే రోజు రాత్రికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం పార్టీ ఆఫీస్‌లో తెలంగాణ జనసేన నేతలు, వీరమహిళలతో సమావేశమయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశం, అభ్యర్థుల సన్నద్ధతపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో పోటీ చేసే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని పవన్‌ను నేతలు, వీరమహిళలు కోరారు. 2014లో టీడీపీ-బీజేపీ కూటమికి భేషరతుగా మద్ధతు పలికామని, గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పోటీ విరమించుకుని బీజేపీ గెలుపుకు పనిచేశామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయని పక్షంలో క్యాడర్‌ మనోస్థైర్యం దెబ్బతింటుందనీ, జనంలో దృష్టిలోనూ చులకనైపోతామని, అది పార్టీ భవిష్యత్తు ఏమాత్రం మంచిది కాదని తమ అధినేత పవన్‌కు సవివరంగా వివరించారు ఆ పార్టీ నేతలు, వీరమహిళలు. అయితే ఈ సందర్భంగా పవన్‌ కీలక వ్యాఖ్య చేశారు. తెలంగాణలో పోటీ చేసే విషయంలో తాను ఖచ్చితంగా ఒత్తిడిలో ఉన్నానని పేర్కొన్నారు. అయినప్పటికీ జనసేన క్యాడర్‌, లీడర్స్, పార్టీ అభిమానుల అభిప్రాయాన్ని గౌరవించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తనకు రెండు, మూడు రోజులు సమయం కావాలని, ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. సరిగ్గా ఈ పరిణామం తర్వాత 24 గంటలు తిరగక ముందే బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం పవన్‌ను సంప్రదించడం గమనార్హం.

Also read: మార్గదర్శి క్వాష్ పిటిషన్ 8 వారాలకు వాయిదా

పవన్‌ దారెటు?
బుధవారం ఉదయం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. తన కార్యాలయానికి విచ్చేసిన వీరిద్దరికి పవన్‌ కళ్యాణ్‌ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన చర్చల్లో జనసేన తెలంగాణ నేతలు తన వద్ద వెలిబుచ్చిన అభిప్రాయాలను పవన్‌ కళ్యాణ్‌ బీజేపీ నేతలకు వివరించారు. ఈ మీటింగ్‌పై టీబీజేపీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే జనసేన మాత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో తెలంగాణలో ఇరు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై చర్చించినట్లు జనసేన చెబుతున్నప్పటికీ.. తమకు మద్ధతు ఇవ్వాలని మాత్రమే పవన్‌ను బీజేపీ కోరినట్లు తెలుస్తోంది. దీంతో పవన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి పోటీ చేసేందుకు అంగీకరిస్తూనే జనసేనకు సీట్లు కేటాయించాలని కోరతారా? లేదా బీజేపీ పెద్దల విజ్ఞప్తి మేరకు మద్ధతు ప్రకటించి మరోసారి పోటీ నుంచి తప్పుకుంటారా? లేదా.. తెలంగాణ జనసేన నేతలు, జనసైనికులు, వీరమహిళల డిమాండ్‌ మేరకు ఏది ఏమైనప్పటికీ పోటీలో నిలిచేందుకే మొగ్గుచూపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఒకటి రెండు రోజుల్లోనే పవన్‌ తన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు