తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్‌లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఎన్ఎండీసీ, హైదరాబాద్ రన్నర్స్ కలిసి మారథాన్‌ను నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ స్థాయిలో క్రీడారంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఉండే లక్షలాది మంది క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నామని.. వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా చేపడతామని పేర్కొన్నారు. అలాగే కేంద్రం అమలు చేస్తోన్న ఖేల్ ఇండియా, జాతీయ క్రీడోత్సవాలను తెలంగాణలో నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
2036లో భారత్‌లో ఒలింపిక్స్
అయితే వీటితో పాటు 2036 నాటికి ఒలింపిక్స్ నిర్వహించే అవకాశాన్ని తెలంగాణకు ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడోత్సవాలు చేపట్టేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. 2036 నాటికి ఒలింపిక్స్ పోటీలను భారత్‌లో నిర్వహించాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని.. ఒలింపిక్స్ నిర్వహణకు హైదరాబాద్‌ను ఎంపిక చేయాలని కోరారు. ఈ క్రీడా పోటీలు నిర్వహించేందుకు అవసరమైన మౌళికసదుపాయాలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. అలాగే భవిష్యత్తులో దేశంలో నిర్వహించబోయే ఎలాంటి క్రీడోత్సవాలైన వాటిని హైదరాబాద్‌కు కేటాయించాలని తెలిపారు. ఎలాంటి పొరపాటు జరగకుండా వాటిని విజయవంతం చేస్తామన్నారు.
Also Read: భారత్‌లో టెలిగ్రామ్ యాప్‌పై విచారణ.. త్వరలోనే బ్యాన్ !
బిలియన్ల డాలర్ల ఖర్చు
వాస్తవానికి ఒక దేశంలో నాలుగేళ్లకొకసారి జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ గేమ్స్‌ను నిర్వహించడం సాహసోపేతమైన చర్య. ఒలింపిక్స్ పోటీలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. అలాగే ఈ పోటీలు నిర్వహించే ప్రదేశంలో అన్నిరకాల మౌళిక సదుపాయలు ఉండాలి. గతంలో ఒలింపిక్స్‌ను నిర్వహించిన పలు దేశాలు ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఒలింపిక్స్ నిర్వహించేదుకు నానా ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటిది అభివృద్ధి చెందుతున్న మనలాంటి భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఒలింపిక్స్ నిర్వహించడానికి ఎంత ఖర్చు అవుతుంది ?. బిలియన్ల డాలర్లు ఖర్చు చేసే అతిథ్య దేశాలకు ఈ క్రీడలు ప్రయోజనాలు అందిస్తాయా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దాదాపుగా అన్ని దేశాలు పాల్గొనే ఈ ఒలింపిక్స్ పోటీల నిర్వహణకు భారీగా ఖర్చు అవుతుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ స్టడీ ప్రకారం.. ఒలింపిక్స్ గేమ్స్‌ను నిర్వహించాలంటే ఒక దేశానికి దాదాపు సగటను 12 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. 1960 నుంచి ప్రతీ ఒలింపిక్స్ పోటీలకు కూడా అతిథ్య దేశాలు అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఖర్చు అయినట్లు ఈ నివేదిక తెలిపింది. 2024లో పారిస్‌లో ఒలింపిక్స్ గేమ్స్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఒలింపిక్స్, పారాలింపిక్స్ గేమ్స్ నిర్వహించేందుకు దాదాపు 9.7 బిలియన్ డాలర్లు అవుతుందని పారిస్ అంచనా వేసింది. ఒలింపిక్ గేమ్స్ జులై 26న ప్రారంభమై ఆగస్టు 11న ముగిసిన సంగతి తెలిసిందే. అలాగే పారాలింపిక్స్ గేమ్స్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు అక్కడ జరగనున్నాయి.
S&P గ్లోబల్ రేటింగ్స్ నివేదిక ప్రకారం కూడా పారిస్‌లో జరిగే ఆటల కోసం 10 బిలియన్ డాలర్ల కంటే కంటే తక్కువ ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలే దీనికి కారణం. ఈ ఒలింపిక్స్‌లో అక్కడ దాదాపు 95 శాతం వేదికలు ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఆ తర్వాత ఓ మూడింటిని నిర్మించారు. అవి.. $1.6 బిలియన్ల ఒలింపిక్ విలేజ్, $190 మిలియన్ల ఆక్వాటిక్స్ సెంటర్ అలాగే $150 మిలియన్ల జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్ వేదిక. 2008 లో చైనాలోని బీజింగ్‌లో నిర్వహించిన ఒలింపిక్స్‌కి 40 -44 బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యాయి. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌కి 15 బిలయన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఇక 2016లో బ్రెజిల్ జరిగిన పోటీలకు 13.1 బిలయన్ డాలర్లు, 2021లో టోక్యోలో జరిగిన పోటీలకు 12.8 బిలియన్ డాలర్ల వరకు ఖర్చయ్యాయి. ఇలా ఒక్కో దేశంలో అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను బట్టి, బడ్జెట్‌లో తేడాలు ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించాలంటే కనీసం 10 నుంచి 15 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.80 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్లు కావాలి.
Also Read: రష్యాపై డ్రోన్ దాడి.. 38 అంతస్తుల భవనంపై..
రూ.లక్ష కోట్ల కన్నా ఎక్కువగా ఖర్చు
వాస్తవానికి మన దేశంలో ఒక్క క్రికెట్‌కు తప్ప మిగిలిన క్రీడలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. ఇప్పుడిప్పుడే మిగతా క్రీడలకు కూడా ప్రోత్సాహం వస్తోంది. ఇక ఒలింపిక్స్ పోటీల నిర్వహణకు మన దేశంలో ఉండే మౌలిక సదుపాయాలు కూడా చాలా తక్కువే. ఒలింపిక్స్ క్రీడల కోసం ప్రత్యేకంగా పలు వేదికలు నిర్మించాల్సి ఉంటుంది. 2036 నాటికి అంటే రూ.లక్ష కోట్ల కన్నా చాలా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇంత పెద్ద మొత్తం భారత ప్రభుత్వం కేటాయించగలదా అనేది పెద్ద ప్రశ్న. మరి ఇండియాలో నిర్వహించేందుకు ముందడుగు వేస్తారా ? లేదా? అనేది వేచి చూడాల్సిందే.
అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) నివేదికల ప్రకారం.. ఒలింపిక్ క్రీడలను నిర్వహించడం వలన శక్తివంతమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని చెబుతోంది. క్రీడలను నిర్వహించడం వల్లే మరింత ఉపాధి లభిస్తుందని, పర్యాటకం అభివృద్ధి చెందుతుందని, నగర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అంటోంది. 2024లో జరిగిన ఒలింపిక్స్ పారిస్‌కు దాదాపు 12.2 బిలియన్ డాలర్ల నికర ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ది యూనివర్సిటీ ఆఫ్ లిమోజెస్ అనే నివేదిక పేర్కొంది. అయితే కొందరు ఒలింపిక్ క్రీడలు ఆర్థికంగా లాభదాయకం కాదని చెబుతున్నారు.. ఇక మరికొందరు దేశ ఆర్థిక ప్రగతిలో ఒలింపిక్స్ గేమ్స్ కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు.