Komatireddy Venkatreddy: మైనంపల్లి చేరికకు కోమటిరెడ్డి దూరం.. ఆయనపై ఆగ్రహంతోనేనా?

పైకి దోస్తీ.. లోపల కుస్తీ.. ఇదీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల పరిస్థితి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందట.

New Update
Komatireddy Venkatreddy: మైనంపల్లి చేరికకు కోమటిరెడ్డి దూరం.. ఆయనపై ఆగ్రహంతోనేనా?

Komatireddy Venkatreddy: పైకి దోస్తీ.. లోపల కుస్తీ.. ఇదీ ప్రస్తుతం తెలంగాణ(Telangana) కాంగ్రెస్ (Congress) సీనియర్ నేతల పరిస్థితి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందట. ఓవైపు సమీపిస్తున్న ఎన్నికలు.. ఈసారి ఎలాగైనా గెలవాలనే కసి.. మరోవైపు తమ వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తున్నారనే ఆగ్రహం.. వెరసి తనలో తానే అసంతృప్తితో రగిలిపోతూ మౌనంగా ఉండిపోతున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఎందుకంత ఆగ్రహం? ఆయనకు ఇష్టం లేకుండా పార్టీలోకి ఎవరిని చేర్చుకుంటారు? ఆర్టీవీ ప్రత్యేక కథనం మీకోసం..

కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ను పెంచాయి. కర్నాటక ఫార్ములాను పాటిస్తే.. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని ఆ పార్టీ నేతలంతా భావించారు. ఇంకేముంది.. వరుస మీటింగ్స్, ప్రెస్‌మీట్లు, సభలు, సమావేశాలతో హోరెత్తించారు. అన్నింటికంటే ముఖ్యంగా.. తెలంగాణ కాంగ్రెస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి, ఐకమత్యం ప్రదర్శిస్తున్నారు. లోలోప ఎన్ని ఆగ్రహావేశాలు ఉన్నప్పటికీ.. బయటకు మాత్రం భాయి భాయి అంటూ అలయ్ బలయ్ చేసుకుంటున్నారు. ఆ ఊపుతోనే పార్టీలోకి చేరికలను పోత్సహిస్తున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా ఎవరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతున్నారు కాంగ్రెస్ నేతలు.

అయితే, రాష్ట్రంలో గెలుపు కోసం ఏకతాటిపైకి వచ్చి, ఐకమత్యం ప్రదర్శిస్తున్న నేతల మధ్య ఇప్పుడు ఆ చేరికలే చిచ్చు పెడుతున్నాయట. ఎవరిని పడితే వారిని పార్టీలోకి తీసుకోవడంపై కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నేతలు కినుకు వహిస్తున్నారట. తమకు వ్యతిరేక వర్గాలను తీసుకువచ్చి పార్టీలో తమ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానిస్తున్నారు నేతలు. ఆ కొందరు అసంతృప్త నేతల పేర్లలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అవును, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్రుగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. తనను సంప్రదించకుండానే.. తన నియోజకవర్గానికి చెందిన నేతలను, అందునా తనపై విమర్శలు చేస్తున్న నేతలను రేవంత్ పార్టీలో చేర్చుకుంటున్నారని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. మొన్నటికి మొన్న వేముల వీరేశం, నిన్న కుంభం అనిల్‌లను పార్టీలో చేర్చుకోవడంపై అలకబూనారట.

ప్రధానంగా కుంభం అనిల్ చేరికను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. యాదాద్రి డిసిసి అధ్యక్షుడిగా ఉన్న కుంభం అనిల్ ఇటీవల పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మందుల సామేలును కోమటిరెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఆయనే స్వయంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఇటీవల రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి.. పార్టీని వీడిన కుంభం అనిల్‌ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనే స్వయంగా కండువా కప్పి మళ్లీ పార్టీలో చేర్చారు. అయితే, కుంభం అనిల్ పార్టీలో చేరిన విషయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అస్సలు తెలియదట. ఈ విషయంలో మరింత ఆగ్రహంతో ఉన్నారట కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండలో సైలెంట్‌గా తన ప్రాబల్యం తగ్గిస్తున్నారని, తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో కల్పించుకుంటున్నారని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట.

ఆ సంగతి అలా ఉంటే.. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు చేరికను కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి.. కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ మైనంపల్లి హనుమంతరావును ఢిల్లీకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే, మైనంపల్లి చేరిక సమయంలో కాంగ్రెస్ కీ లీడర్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేకపోవడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్‌ రెడ్డితో విభేదాల కారణంగానే మైనంపల్లి చేరికకు కోమటిరెడ్డి దూరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ చేరికలకు దూరంగా ఉండటం రేవంత్ రెడ్డితో ఆయన సంబంధం మరింత క్షీణతకు దారితీసినట్లు భావిస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు.

మొత్తానికి పార్టీలో తన ప్రాబల్యం తగ్గిస్తున్నారని, అందులోనూ తన జిల్లా నల్లగొండలో తనకు తెలియకుండానే వ్యవహారాలు చక్కబెడుతున్నారని, వ్యతిరేక వర్గాన్ని పార్టీలో చేరుస్తూ జిల్లా రాజకీయాల్లో తనను ఒంటరిని చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉన్నారట. అటు చూస్తే ఎన్నికలకు పెద్దగా సమయం కూడా లేదు. ఇలాంటి సమయంలో ఈ అసంతృప్తులు, ఆగ్రహాలు ఎటు దారి తీస్తాయో చూడాలి మరి.

నందికంటి వ్యతిరేకత..

ఈ పంచాయితీ ఇలా ఉంటే.. మల్కాజిగిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు చేరికను నందికంటి శ్రీధర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీని ఎంతో అభివృద్ధి చేసిన తనను కాదని, మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ ఇస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మరోవైపు మైనంపల్లి హనుమంత రావును కాంగ్రెస్‌లో చేర్పించేందుకు ఆయనను ఢిల్లీకి తీసుకెళ్లారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ముఖ్యనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇదే సమయంలో శ్రీధర్ ఢిల్లీకి వెళ్లడం కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది. మైనంపల్లి చేరికను వ్యతిరేకిస్తున్న ఆయనను కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించేందుకే ఢిల్లీకి పిచినట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి బదులుగా కుత్భుల్లాపూర్ నియోజకవర్గం సీట్ ఆయన ఇస్తామని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ హామీపై నందికంటి కూల్ అయ్యారా? లేక పార్టీ మార్పు ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? అనేది త్వరలో తేలనుంది.

Also Read:

RTV Bramhanandam Interview: రంగమార్తాండ కోసం మూడు రోజులు ఉపవాసం.. హాస్యబ్రహ్మతో స్పెషల్ ఇంటర్వ్యూ లైవ్

Earthquake Alert Service: భూకంపం వస్తే మీ ఫోన్ ముందే చెప్పేస్తుంది.. అదెలాగంటే..

#telangana #telangana-congress #revanth-reddy #komatireddy-venkat-reddy
Advertisment
తాజా కథనాలు