Skin Swelling Symptoms : శరీరంలో రెండు రకాల వాపులు ఉన్నాయి. ఒకటి కీటకాలు(Insects) కుట్టడం వల్ల జరిగితే మరొకటి శరీరంలోని ఏదైనా భాగంలో నీరు చేరడం వల్ల వస్తుంది. మొదటి దాన్ని వాపు(Swelling) అని, రెండవ దాన్ని ఎడెమా(Edema) అని పిలుస్తారు. ఒక క్రిమి చర్మాన్ని కొరికితే శరీరంలోని ఆ అవయవం వాపునకు గురవుతుంది. ఈ వాపు కొన్ని క్రీములు రాసినా, మందులు వేసుకుంటే పోతుంది. కానీ వాపు తర్వాత చర్మం లోపల ఎలాంటి మార్పులు వస్తాయనే ప్రశ్నలు తలెత్తుతాయి.
వాపు ఎందుకు వస్తుంది..?
- ఒక కీటకం కరిచినప్పుడు, అది కలిగించే మంట లేదా గాయం తర్వాత ప్రతిచర్యగా మన శరీరంలో ఆ భాగం ఉబ్బిపోతుంది. నొప్పి, కీటకాల విషం వేగంగా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
వాపు ఉన్నప్పుడు శరీరం లోపల ఏం జరుగుతుంది?
- వాస్తవానికి చర్మం కింద ఒక ప్రదేశంలో ద్రవం పేరుకుపోయినప్పుడు వాపు వస్తుంది. గాయం లేదా క్రిమి కాటు విషయంలో శరీర రక్షణ వ్యవస్థ వెంటనే చురుకుగా మారుతుంది. దీంతో వాపు ఏర్పడుతుంది.
ఎన్ని రకాల వాపులు ఉన్నాయి..?
- ఏకంగా 5 రకాలకు పైగా వాపులు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మోకాళ్లు, కాళ్లు లేదా చేతుల్లోని శోషరస గ్రంథుల సమస్య వల్ల వచ్చే వాపును పెరిఫెరల్ ఎడెమా అంటారు. శోషరస గ్రంథులు మన శరీరంలోని సూక్ష్మజీవులు, టాక్సిన్‌లను ఫిల్టర్ చేయడానికి పని చేస్తాయి. శస్త్రచికిత్స లేదా క్యాన్సర్ చికిత్స సమయంలో రేడియేషన్(Radiation) కారణంగా శోషరస గ్రంథులు దెబ్బతిన్నప్పుడు సంభవించే వాపును లింఫెడెమా అంటారు. కణితి, గాయం, రక్తనాళాలు పగిలిపోవడం, బ్రెయిన్ హెమరేజ్ వంటి ఏదైనా కారణాల వల్ల మెదడు లోపల వాపు వచ్చినప్పుడు దానిని సెరిబ్రల్ ఎడెమా అంటే మెదడు వాపు(Brain Swelling) అంటారు. గర్భధారణ సమయంలో, వృద్ధాప్యంలో వచ్చే వాపును పెడల్ ఎడెమా అంటారు. కాలి దిగువ భాగాలలో ద్రవం చేరడం వల్ల ఈ వాపు వస్తుంది. ఊపిరితిత్తులలో గాలి సంచులు ద్రవంతో నిండినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. దీన్ని పల్మనరీ ఎడెమా అంటారు. కంటిలోని రెటీనా మధ్య మాక్యులా అనే కణజాలం ఉంటుంది. ఈ కణజాలం చుట్టూ గాయం అయినప్పుడు రక్త నాళాలలో ద్రవం చేరడం ప్రారంభమవుతుంది. ఇది మాక్యులర్ ఎడెమాకు కారణం అవుతుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: పాముకాటుకు గురైతే పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.