Kashi: పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న కాశీ నగరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అత్యంత పురాతనమైన, పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. కాశీ వీధులు కూడా ఒక అద్భుతం అనే చెప్పవచ్చు. ఎటుచూసినా పండితులు మంత్రాలు జపిస్తూ ఉంటారు. మరోవైపు మరణించినవారిని తమ భుజాలపై మోసే వ్యక్తులు కనిపిస్తుంటారు. కాశీ వీధులు కీర్తనలతో, ఘాట్‌లు పవిత్రశక్తి, ఆచారాలతో నిండిపోయి ఉంటాయి. ఆ నగరం గాలి భక్తి, స్వచ్ఛతకు ప్రతిరూపంగా భావిస్తారు. వేలాది సంవత్సరాలుగా కాశీలో ముక్తిని కోరుకునే యాత్రికులు, భక్తులను ఈ నగరం ఆహ్వానిస్తోంది.
కాశీలో మరణించడమే పరమ విముక్తి:
హిందువులకు దహన సంస్కారాలు అత్యంత ముఖ్యమైనవి. జనన, మరణ చక్రంపైనే జీవితం ఆధారపడి ఉంటుంది. మోక్షం' అని పిలువబడే ఈ చక్రం నుంచి విముక్తి అనేది అంతిమ లక్ష్యం. ఆపై కాశీలో మరణిస్తే విముక్తి వైపు వెళ్తారని నమ్మకం. ఈ ఆధ్యాత్మిక నగరం మానవుల ఆత్మ అంతిమ విముక్తిని చేరుకోవడానికి సహాయపడుతుందని హిందువులు నమ్ముతారు.
పుట్టుక, మరణం నుంచి విముక్తి:
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు కాశీలో మరణిస్తే మోక్షం, విముక్తి లభిస్తాయనే విశ్వాసం చరిత్రలో నిలిచిపోయింది. చాలా మందికి కాశీ స్వర్గానికి సులభమైన ద్వారం లాంటిది. హిందూ గ్రంధాల ప్రకారం.. కాశీలో తుది శ్వాస విడిచిన వారు సంసారం అనే సంకెళ్ళ నుంచి విముక్తి పొందుతారని చెబుతున్నారు. ఈ విముక్తి కేవలం ప్రాపంచిక బాధల నుంచి తప్పించుకోవడమే కాకుండా శాశ్వతమైన ఆనందం లభిస్తుందని నమ్ముతారు.
కాశీ ముక్తి భవన్:
కాశీ నడిబొడ్డున దివ్యమైన కాశీ ముక్తి భవన్ ఉంది. ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మోక్షం పొందేందుకు వస్తారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, శాంతిని కోరుకునే వారు చివరి రోజుల్లో ఇక్కడికి రావడం ద్వారా మోక్షాన్ని పొందుతారు. కాశీ పవిత్ర స్థలంలో తమ చివరి రోజులను గడపాలని కోరుకునే వారికి ఆశ్రయం కల్పించాలనే గొప్ప ఉద్దేశ్యంతో దీన్ని నిర్మించారు.
ఇది కూడా చదవండి: జుట్టు రాలడానికి అసలు కారణాలు ఈ పరీక్షలతో తెలుసుకోండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.