TN Seshan: ఈ సీఈసీ చండశాసనుడు.. దెబ్బకు ప్రధానులే వణికిపోయేవారు..! 'ఓటు' రాతను మార్చిన సంస్కరణ కర్త గురించి తెలుసుకోండి!

భారతీయ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చిన చండశాసనుడు టీఎన్‌ శేషన్. గత 72 ఏళ్లలో ఎన్నడూ లేనంత సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్‌కు దేశం సన్నద్ధమవుతున్న సమయంలో మరోసారి ప్రజలకు గుర్తొచ్చారు శేషన్‌ . ఇంతకీ శేషన్‌ ఏం చేశారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
TN Seshan: ఈ సీఈసీ చండశాసనుడు.. దెబ్బకు ప్రధానులే వణికిపోయేవారు..! 'ఓటు' రాతను మార్చిన సంస్కరణ కర్త గురించి తెలుసుకోండి!

Who Was TN Seshan - Explained: ఎన్నికలు వస్తే 1990 ముందు వరకు దేశంలో అధికార పార్టీలు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగేది. ఎన్నికల విషయంలో పెత్తనమంతా 'ప్రధానులదే'. ఎన్నికల తేదీలు ఎప్పుడు ప్రకటించాలి? ఎన్నికలు ఎప్పుడు జరపాలి? ఏ రాష్ట్రంలో ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించాలి? ఇలా ఒకటేమిటి ఎన్నికలకు సంబంధించిన ప్రతీది అధికార పార్టీలే వెనుకనుంచి చూసుకునేవి. భారత్‌ ఎన్నికల కమిషన్‌(ECI) పేరుకే స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థగా ప్రజలకు కనిపించేది. ఇదంతా బహిరంగంగానే జరిగేది. అయితే 1990 డిసెండర్‌ 12 తర్వాత మొత్తం మారిపోయింది. భారత్‌ ఎన్నికల కమిషన్ రాజ్యాంగం తనకిచ్చిన పవరేంటో చూపించేందుకు ముహూర్తం పడిన రోజు అది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా టీఎన్ శేషన్ (TN Seshan) పదవి చేపట్టిన రోజు అది. అప్పటి నుంచి 'ఓటు' (Vote) రాత మారిపోయింది. దొంగ ఓట్లకు కాలం చెల్లింది. 18వ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి శేషన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. మొదటి సార్వత్రిక ఎన్నికలను మినహాయిస్తే గత 72 ఏళ్లలో ఎన్నడూ లేనంత సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్‌కు దేశం సన్నద్ధమవుతున్న సమయంలో మరోసారి శేషన్‌ ప్రజలకు గుర్తొచ్చారు. అధికార పార్టీకి అనుగుణంగా షెడ్యూల్‌ను రూపొందించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతోన్న వేళ శేషన్‌ లాంటి ఎలక్షన్‌ కమిషనర్‌ (Election Commissioner) ఉండి ఉండాల్సిందని సోషల్‌మీడియాలో ఆయనకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ శేషన్‌ ఏం చేశారు? ఎన్నికలు జరిగే ప్రతీసారి ప్రజలు ఆయన్ను ఎందుకు గుర్తుచేసుకుంటారు?


అలాంటి అధికారిని మళ్లి చూడగలమా?
దొంగ ఓట్లతోనే అందలం ఎక్కుతున్న నేతల గుండెల్లో గుబులు రేపారు శేషన్‌. ఓటరు కార్డు నుంచి గోడలపై రాతల బంద్‌ వరకు అనేక సంస్కరణలు ఆయన హయంలో వచ్చినవే. 1990 డిసెంబర్‌ 12 నుంచి 1996 డిసెంబర్‌ 11వరకు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా పనిచేసిన శేషన్‌ రాజ్యాంగానికి ఉన్న బలమేంటో కళ్లకు కట్టినట్టు చూపించారు. అదే సమయంలో అక్రమాల ద్వారా కూర్చి ఎక్కే బడా నేతల్లో భయం పుట్టించారు. శేషన్‌ అంటే అందరికీ గౌరవం.. శేషన్ అంటే కొందరికి భయం.. శేషన్‌ అంటే మరికొందరికి కోపం. అందుకే నాటి బెంగల్‌ సీఎం బసు (Basu) శేషన్‌ని మొదట పిచ్చికుక్కతో పోల్చారు. తర్వాత ఆయనేంటో అర్థంచేసుకున్నారు. మార్పు కోసం పరితపించి పనిచేసే వారు ఏ దేశంలోనైనా మొదట అనుభవించాల్సింది అహేతుకమైన విమర్శలే. అయితే శేషన్‌కు పని మాత్రమే తెలుసు.. కేవలం పనే తెలుసు.. ఆయనో పని రాక్షసుడు.. అందుకే ఎన్నికలెప్పుడొచ్చినా పారదర్శకత కోసం ఓటర్లు శేషన్‌నే తలుచుకుంటారు. ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన కేసుల విచారణ చేపట్టిన ప్రతీసారి సుప్రీంకోర్టు నిత్యం శేషన్‌నే స్మరించుకుంటుంది. శేషన్‌లాంటి వారు కావాలని సుప్రీం అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చిందటే దేశ ఎన్నికల వ్యవస్థపై శేషన్‌ ఎలాంటి ముద్ర వేశారో అర్థం చేసుకోవచ్చు.

publive-image శేషన్ పై అనేక సందర్భాల్లో సుప్రీం ప్రశంసలు

మెట్రో మ్యాన్‌ శ్రీధరన్‌తో కలిసి:
తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్ (Tirunellai Narayana Iyer Seshan )డిసెంబర్ 15, 1932న కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు. పాలక్కాడ్‌లోని ప్రభుత్వ విక్టోరియా కళాశాలలో 12వ తరగతి పూర్తి చేశారు. మెట్రో మ్యాన్‌ శ్రీధరన్‌ కూడా అదే కాలేజీలో చదివారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజీకల్‌ యూనివర్శిటీకి ఎంపికయ్యారు. అయితే శేషన్ మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుంచి బీఎస్సీ చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడే భౌతికశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. 1954లో UPSC క్లియర్ చేసి తమిళనాడు కేడర్‌లో చేరారు.

TN Seshan కిరణ్ బేడితో శేషన్

ఏకంగా బస్సును నడిపారు:
1962లో ఆయన తన కొత్త బాధ్యతలను స్వీకరించారు. మద్రాసు రవాణా శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ట్రాఫిక్ నిబంధనల విషయంలో శేషన్ చాలా కఠినంగా వ్యవహరించారు. ఆయన పట్టుదల, అంకితభావం ఎలాంటిదో చెప్పే ఓ ఉదాహరణ గురించి తెలుసుకోండి. ఒకసారి ఒక బస్ డ్రైవర్ శేషన్‌తో 'నీకు బస్సు ఇంజన్ అర్థం కావడం లేదు, బస్సు ఎలా నడపాలో నీకు తెలియదు. మీరు మా సమస్యలను ఎలా అర్థం చేసుకోగలరు'? అని ప్రశ్నించాడు. నిజానికి డ్రైవర్‌ మాటలను వింటే అధికారులకు కోపం రావాలి. కానీ శేషన్‌ అలా కాదు. డ్రైవర్‌ మాటలను అర్థం చేసుకున్నాడు. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న శేషన్ బస్సు నడపడం నేర్చుకున్నారు. ఇంజన్‌ తెరిచి, మళ్లీ ఒకచోట చేర్చి బస్సును నడపగలనని డ్రైవర్‌కు చూపించారు. ఒక రోజు అధికారికంగా శేషన్‌ బస్సు నడిపారు. స్వయంగా బస్సును 80 కిలోమీటర్లు ప్యాసింజర్లతో డ్రైవ్ చేశారు.

TN Seshan శ్రీదేవితో శేషన్ credit (Indian Express archive photo: Ramesh Nair)

సుబ్రమణ్యస్వామితో స్నేహం:
శేషన్ ప్రయాణం ఇక్కడితో ఆగి ఉంటే మనం ఇవాళ ఆయన గురించి చెప్పుకునేవాళ్లం కాదు. ఆ తర్వాత హార్వర్డ్‌కు వెళ్లిన శేషన్‌ అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. ఇక్కడే సుబ్రమణ్యస్వామికి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని లిఖించబోతోందని అప్పుడు శేషన్‌ కూడా ఊహించి ఉండరు. 1969లో దేశానికి తిరిగి వచ్చారు శేషన్. ఇక్కడ అటామిక్ ఎనర్జీ కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1972లో అంతరిక్ష శాఖలో జాయింట్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు.


రాజీవ్‌తో ప్రయాణం:

తమిళనాడు ప్రభుత్వంలో MG రామచంద్రన్ ముఖ్యమంత్రిగా మొదటి ఇన్నింగ్స్‌లో (1977-80) పరిశ్రమల కార్యదర్శి, వ్యవసాయ కార్యదర్శి లాంటి పదవులను నిర్వహించారు. తన రాజకీయ నాయకులతో విభేదాల కారణంగా సెంట్రల్ పోస్టింగ్‌ని ఎంచుకోవలసి వచ్చింది. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలో కార్యదర్శి పదవిని చేపట్టారు శేషన్‌. ఆయన హయాంలో పర్యావరణం, అడవులకు సంబంధించి అనేక కఠినమైన చట్టాలు అమలు చేసింది రాజీవ్‌ సర్కార్‌. జంతువుల వేట విషయంలో కూడా శేషన్ చాలా కఠినంగా వ్యవహరించారు. 1989లో రాజీవ్‌గాంధీ అధికారంలో లేకపోవడంతో వీపీ సింగ్‌ అధికారంలోకి వచ్చారు. శేషన్ కేబినెట్ సెక్రటరీ పదవిని పొందారు.


శేషన్‌ వర్సెస్‌ ది నేషన్:
1990లో శేషన్ దేశ 10వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. చంద్రశేఖర్ ప్రభుత్వంలో లా అండ్ కామర్స్ మంత్రిగా పనిచేసిన సుబ్రమణ్యస్వామి శేషన్ నియామకంలో కీలక పాత్ర పోషించారు. ఇక అప్పటినుంచి భారత్‌ ఎన్నికల ముఖచిత్రం మారిపోయింది. 1991 లోక్‌సభ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ శేషన్ తన మార్క్‌ చూపించాడు. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చినా వెంటనే ఎన్నికలను నిలిపివేసి కొత్త ఎన్నికలు పెట్టేవారు. అలా బీహార్‌లో ఒకటి కాదు నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. దీంతో నాటి బీహార్‌ సీఎం లాలూ శేషన్‌పై సీరియస్‌ అయ్యారు. శేషన్‌ వర్సెస్ ది నేషన్ అంటూ లాలూ నినాదాలు చేశారు . శేషన్‌ని అదుపు చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. సభలో ఆయనపై అభిశంసనకు సిఫారసు చేశారు. కానీ నాటి ప్రధాని పీవీ నరసింహారావు అలా జరగనివ్వలేదు.

publive-image పీవీ నరసింహారావుతో టీఎన్‌ శేషన్

ఫొటో పెట్టాల్సిందే:
నకిలీ ఓటింగ్‌ను అరికట్టేందుకు ఓటర్ ఐడీలో ఓటర్ల ఫొటోలు పెట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఎక్కువ ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిరాకరించింది. శేషన్ కూడా వెనక్కి తగ్గలేదు. ఫొటో పెట్టనంత వరకు ఒక్క ఎన్నికలు కూడా నిర్వహించబోమని తెగెసి చెప్పారు. దీంతో ప్రభుత్వమే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 1995లో ఫొటోతో కూడిన ఓటర్ ఐడీని ప్రవేశపెట్టారు. ఇక ఆయన సీఈసీగా ఉన్న సమయంలోనే గోడలపై రాతలు బంద్‌ అయ్యాయి. అభ్యర్థుల ఖర్చుకు పరిమితులు విధించడం కూడా శేషన్‌ నిర్ణయమే. మతపరమైన స్థలాల్లో ఎన్నికల ప్రచారంపై నిషేధంతో పాటు ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడటంపై నిషేధం విధించిన గొప్ప సంస్కరణవేత్త శేషన్‌. 1990కు ముందు పార్టీలు ఎన్నికల ప్రచారంలో మైకులు ఇష్టారీతిన వాడేవారు. అయితే అనుమతి లేకుండా మైకుల వాడకంపై శేషన్‌ నిషేధం విధించారు. అంతేకాదు సంస్థాగత ఎన్నికలు జరపని పార్టీల గుర్తింపు రద్దు చేస్తానని హెచ్చరించిన శేషన్‌ దెబ్బకు నాడు కేంద్రంతో పాటు రాష్ట్రాల పెద్దలు గజగజా వణికిపోయేవారు. ఇలా ఒకటి రెండు కాదు.. 150కు మార్పులకు శేషన్‌ శ్రీకారం చుట్టారు. ఒక మాటలో చెప్పాలంటే దేశ ఎన్నికల చరిత్ర శేషన్‌కు ముందు శేషన్‌కు తర్వాత అనే విధంగా మారిపోయింది.

publive-image TN శేషన్ తన భార్యతో కలిసి అశోక్ హోటల్‌లో 1993లో రోటరీ క్లబ్ సమావేశంలో పాల్గొన్నారు

మెగసెసె అవార్డు:
1990-96 వరకు శేషన్‌ మధ్యతరగతి ప్రజల ఐకాన్‌గా మారారు. ఎన్నికల అవినీతిపై ఆయన చేసిన పోరాటాలకు, సంస్కరణలకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆయనకు 1996లో రామన్ మెగసెసే అవార్డు లభించింది. అయితే భారతీయ ప్రభుత్వం మాత్రం శేషన్‌ విప్లవాత్వక మార్పులకు తిగిన గుర్తింపు ఇవ్వలేదనే వాదన ఉంది. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన వారికి అవార్డులు ఇచ్చి సత్కరించిన ప్రభుత్వాలు శేషన్‌కు మాత్రం ఇవ్వలేదు. అయినా శేషన్‌ పనిని అవార్డులతో కొలవలేం. ఆయనే దేశానికి దక్కిన అతిపెద్ద అవార్డు..! దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నంతకాలం శేషన్‌ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఎన్ని ఎన్నికలొచ్చినా శేషన్‌ పేరును ప్రజలు గుర్తుచేసుకుంటూనే ఉంటారు.

Also Read: సీఏఏ అమలు లోకసభ ఎన్నికలను ప్రభావితం చేస్తుందా?మోదీ సర్కార్ ను వారు అర్థం చేసుకుంటారా? సర్వేలు ఏం చెబుతున్నాయి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు