Who is Sam Pitroda?: శామ్ పిట్రోడా.. దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు.. దక్షిణాదివారిని ఆఫ్రికన్లతో పోల్చిన ఈ కాంగ్రెస్ నేతపై సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వచ్చాయి. అందుకే కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ శామ్ పిట్రోడా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే శామ్ పిట్రోడాకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు.. గతంలోనూ ఆయన చేసిన కామెంట్స్ కాంగ్రెస్‌ను ఇరాకటంలో పడేశాయి.. ఇంతకి ఎవరీ శామ్ పిట్రోడా.. గాంధీ కుటుంబంతో ఆయనకున్న సంబంధం ఏంటి? గతంలో ఆయన చేసిన కాంట్రవర్శి కామెంట్స్ ఏంటి లాంటి విషయాలను తెలుసుకుందాం!
పిట్రోడాను ఆహ్వానించిన ఇందిరాగాంధీ
శామ్ పిట్రోడా 1942లో ఒడిశా-టిట్లాగఢ్‌లో జన్మించారు. అక్కడే ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత అమెరికాకు వెళ్లారు. తర్వాత టెక్నాలజీ నిపుణుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన్ని గుర్తించిన అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ 1984లో భారత్‌కు ఆహ్వానించారు. దీంతో శామ్ పెట్రోడా కాంగ్రెస్ పార్టీకు మరింత చేరువయ్యారు. ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, యూపీఏ ప్రభుత్వ హయాంలో వివిధ హోదాల్లో పనిచేశారు. సీ-డాట్ ఆయన హయాంలోనే మొదలైంది. ఎస్టీడీ బుత్‌లు ఏర్పాటు కూడా ఆయన ఆలోచనే. అంతేకాదు 1992లో శామ్ పెట్రోడా ఐక్యరాజ్యసమితిలో కూడా పనిచేశారు. పనితీరులో ఇంతటి మంచి పేరు కలిగిన పిట్రోడాకు నోరు అదుపులో ఉండదన్న విమర్శలు ఉన్నాయి. అవే ఆయనన్ను, కాంగ్రెస్‌ను అనేక సార్లు చిక్కుల్లో పడేశాయి.
Also Read: మాజీ ఎమ్మెల్యే కూతురిపై అత్యాచారం.. రూ. 6 కోట్లు వసూల్!
రామ మందిరంపై వివాదస్పద వ్యాఖ్యలు
పుల్వామాలో ఉగ్రవాదుల దాడికి ప్రతిస్పందనగా భారత్ పాకిస్తాన్‌లోని బాల్‌కోట్‌లో వైమానిక దాడులు చేసింది. దీనిపై ప్రశ్నలను లేవనెత్తుతూ, మార్చి 22, 2019న పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని.. కొంతమంది ఉగ్రవాదులు దాడి చేస్తే మొత్తం పాకిస్తాన్ ఎందుకు శిక్షిస్తున్నారంటూ బాంబు పేల్చారు. అసలు భారత్ చేసిన వైమానిక దాడుల్లో 300 మంది చనిపోయారా అని ప్రశ్నించారు పిట్రోడా. జూన్ 6, 2018న రామ మందిరంపై పిట్రోడా వ్యాఖ్యలు తీవ్ర రచ్చకు దారి తీశాయి. భారత్‌లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం , విద్య లాంటి సమస్యల గురించి ఎవరూ మాట్లాడరని.. అందరూ రాముడు, హనుమంతుడు, గుడి గురించే మాట్లాడుకుంటారని కామెంట్స్ చేశారు. గుడి కట్టడం వల్ల ప్రజలకు ఉపాధి రాదని పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఓ వర్గంపై దుమ్మెత్తిపోసింది. గుడి కట్టే విషయంలోనే దేశ సమస్యలు గుర్తొస్తాయా అని ఆయనపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక రామ్‌మందిర్ అన్నది అసలు ఇండియా ఐడియాకు వ్యతిరేకమని స్టేట్స్‌మెన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మరో బాంబు పేల్చారు పిట్రోడా.
వారసత్వ పన్ను గురించి 2019లో పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మరో వివాదాన్ని సృష్టించాయి. పిట్రోడా వ్యాఖ్యలను బీజేపీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుంది. మధ్యతరగతి ప్రజలు స్వార్థపరులుగా మారకూడదని పిట్రోడా ఏప్రిల్ 6, 2019న కామెంట్స్ చేశారు. మరిన్ని పన్నులు చెల్లించేందుకు సన్నద్ధం కావాలని చెప్పారు. ఈ ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి అదనపు పన్ను భారం పడదని హస్తం పార్టీ చెప్పుకోవాల్సి వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సిక్కు అల్లర్లపై పిట్రోడా చేసిన ప్రకటన ఆయన్ను చిక్కుల్లో పడేసింది. 1984 అల్లర్లను ఆయన క్యాజువల్‌గా కొట్టిపారేశారు. ఇందిరా గాంధీ హత్య అనంతరం సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి. అందులో చాలా మంది సిక్కులు చనిపోయారు. దీనికి రాజీవ్‌గాంధీనే కారణమని బీజేపీ ఆరోపిస్తూ ఉంటుంది. అయితే బీజేపీకి కౌంటర్‌గా మాట్లాడే క్రమంలో పిట్రోడా అల్లర్లను తక్కువ చేసి కామెంట్ చేశారు. ఇది సిక్కుల ఆగ్రహానికి కారణమైంది.. అటు బీజేపీకి మరో ఎన్నికల అస్త్రంగా మారింది.
భారతీయుల రంగుపై వివాదస్పద వ్యాఖ్యలు
ఇలా శామ్ పిట్రోడాకు వివాదాలు కొత్త కాదు.. అయితే ప్రతీసారి ఎన్నికల సమయంలోనే పిట్రోడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం హస్తం పార్టీకి అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఉత్తర భారతీయులను శ్వేతజాతీయులతోనూ, పశ్చిమాన నివసించేవారిని అరబ్బులతోనూ, తూర్పున నివసించేవారిని చైనీయులతోనూ, దక్షిణాదివారిని ఆఫ్రికన్లతో పోల్చడం ఏ మాత్రం ఆమోదనీయం కాదని కాంగ్రెస్ చెప్పుకోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో పిట్రోడా వ్యాఖ్యలను బీజేపీ ఎలాగైతే ఎన్నికల ఆస్త్రంగా వాడుకుందో 2024 ఎన్నికల్లోనూ అదే చేసింది. అంతా జరిగిపోయిన తర్వాత పిట్రోడా రాజీనామా చేయడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Also Read: అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని నిండు గర్భావతిని చంపిన భర్త!
భారతీయుల రంగుపై ఆయన వ్యాఖ్యానించడం వివాదస్పదమైంది. దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. కాంగ్రెస్ దేశాన్ని విభజించి పాలించాలని అనుకుంటోందని.. శరీర రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే సహించేది లేదంటూ ఆయన హెచ్చరింటారు. అయితే ఇప్పటివరకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా (Indian Overseas Congress Chief) కొనసాగతున్న శామ్ పెట్రోడా.. బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు జైరాం రమేష్ చెప్పారు. అయితే ప్రస్తుతం అసలు ఈ శామ్ పిట్రోడా ఎవరూ అనే దానిపై ప్రజలు సెర్చ్ చేస్తున్నారు.