Who Is Ebrahim Raisi : ఒకరు కాదు ఇద్దరు కాదు.. వెయ్యి మంది కాదు.. రెండు వేల మందీ కాదు.. ఏకంగా 5 వేల మందికి మరణశిక్ష (Death Penalty) విధింపుకు కారణమైన వారిలో ఇరాన్ అధ్యక్షుడు (Iran President) ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ఒకరు. అందుకే 2021లో ఇబ్రహీం రైసీ ఇరాన్ పగ్గాలు అందుకోగానే మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమమే చేశారు. సీన్ కట్ చేస్తే ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ క్రాష్ (Helicopter Crash) ల్యాండ్ అవ్వడం ఆయన మరణించడం సంచలనంగా మారాయి. ఇజ్రాయెల్-ఇరాన్‌పై యుద్ధమేఘాలు ఆవహించిన సమయంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అది 2022 సెప్టెంబర్.. ఇరాన్ అట్టుడికిపోయిన రోజులవి..! 22 ఏళ్ల ఇరానియన్ కుర్దిష్ మహిళ మహ్సా అమిని అనుమానాస్పద రీతిలో మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. హిజాబ్ ధరించని అమినిని ఇరాన్ మొరాలిటి పోలీసులు అరెస్ట్ చేయడం.. 3 రోజుల నిర్భందం తర్వాత ఆస్పత్రిలో ఆమె చనిపోవడం ప్రకంపనలు రేపింది. ఇరాన్ మహిళా లోకం ఒక్కసారిగా నాటి ప్రభుత్వంపై దండయాత్ర చేసింది. వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపింది. ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీకి వ్యతిరేకంగా నాడు అక్కడి మహిళలు కదంతొక్కిన తీరు ఇరాన్ ప్రభుత్వంలో భూకంపానికి కారణమైంది. అయితే అణిచివేతే ఆయుధంగా ఇబ్రహీం రైసీ ప్రభుత్వం మహిళలపై కాల్పులకు, దాడులకు పాల్పడింది. నెలల తరబడి జరిగిన ఈ భద్రతా అణిచివేతలో 500 మందికి పైగా మరణించారు. దాదాపు 22,000 మందికి పైగా నిర్బంధించబడ్డారు. ఇవన్ని అధికారిక లెక్కలు మాత్రమే!
ప్రాసిక్యూటర్‌గా
ఇబ్రహీం రైసీ తన జీవితంలో ఎక్కువ భాగం ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 2019లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ రైసీని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత 1988లో రాజకీయ ఖైదీలను సామూహికంగా ఉరితీసిన ఘటనలో రైసీ పాత్ర కారణంగా ఈ నియామకాన్ని మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకించాయి. అంతర్జాతీయ హక్కుల సంఘాల ప్రకారం దాదాపు 5,000 మందికి మరణశిక్ష విధించిన నాటి ఇరాన్ నలుగురి జడ్జిల్లో రైసీ ఒకరు. ఇరాన్‌తో వైరాన్ని కొనసాగిస్తున్న అమెరికా సైతం ఈ 1988 ఉరిశిక్షలలో రైసీ ప్రమేయాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తుంటుంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం 1980వ దశకంలో ఇరాక్‌పై యుద్ధం తర్వాత పలు డెత్ కమిటీలను ఇరాన్ ఏర్పాటు చేసుకుంది. ఈ ప్యానల్‌లో తమ మతాన్ని ఎక్కువగా విశ్వసించే జడ్జిలను పెట్టుకుంది.. ఇందులో రైసీ ఒకరు.
ఇరాన్ న్యాయవ్యవస్థను నడిపిన ఇబ్రహీం రైసీ.. మితవాద మతగురువు హసన్ రౌహానీకి వ్యతిరేకంగా 2017లో అధ్యక్ష పదవికి పోటి చేసి ఓడిపోయారు. 2021లో రైసీ మరోసారి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ఆవిర్భవించిన తర్వాత అత్యంత వివాదాన్ని రేపిన ఎన్నికలు ఇవే. ఎందుకంటే రైసీకి పోటీనే లేదు. దీంతో దాదాపు 62శాతం ఓట్లు సాధించిన రైసీ అధ్యక్షుడు అయ్యాడు. ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో ఇదే అతి తక్కువ ఓటింగ్ శాతం. లక్షలాది మంది ఇళ్లలోనే ఓటు వెయ్యకుండా ఉండిపోయారంటే రైసీపై అప్పటికి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చాంటారు రాజకీయ విశ్లేషకులు!
Also Read : రాష్ట్రంలో అల్లర్లు జరగడానికి కారణం ఇదే.. సిట్ సంచలన నివేదిక..!
రైసీ 1960లో ఇరాన్‌లోని షియా ముస్లిం నగరమైన మషాద్‌లో జన్మించారు. రైసీ 5 సంవత్సరాల వయస్సులో తన తండ్రిని కోల్పోయాడు. కానీ తండ్రి అడుగుజాడలను అనుసరించి మతగురువుగా మారాడు. కోమ్‌లోని మత పెద్దలతో ఆయన పరిచయాలు న్యాయవ్యవస్థలో రైసీని విశ్వసనీయ వ్యక్తిగా మార్చాయి. ఇరాన్ న్యాయవ్యవస్థలో ఉంటూ తమ మత చట్టాలను కఠినంగా అమలు చేసిన వ్యక్తిగా రైసీ గురించి చెబుతుంటారు. అందుకే ఇరాన్‌లో లిబరల్ భావాలు ఎక్కువగా ఉన్నవారికి రైసీ అంటే ఇష్టముండదు.
అటు ప్రపంచవ్యాప్తంగా అమెరికా వైపు నిలిచే దేశాల్లో ఇరాన్‌కు ఉన్న వైరాన్ని రైసీ కొనసాగించారు. 2024లో సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడుల చేసింది. ఇందులో 13మంది ఇరాన్ ఆర్మీ అధికారులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా 2024 ఏప్రిల్ 13న ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణ తీవ్రమైంది. సరిగ్గా ఇదే సమయంలో రైసీ హెలికాఫ్టర్ క్రాష్‌లో మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.