Group - 2 Exams Schedule : తెలంగాణ(Telangana) లో ఎన్నికలు అయిపోయాయి. కొత్త ప్రభుత్వం కూడా అధికార బాధ్యతలు చేపట్టింది. ఇటీవల ఎన్నికల కోడ్ వల్ల గ్రూప్ 2(Group-2) పరీక్షల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయ లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గ్రూప్ 2 పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 5.51 లక్షల మంది పరీక్షలు ఎప్పుడు జరుగుతాయా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షను 2024 జనవరిలో నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే ఈ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ కార్యాచరణ మొదలుపెట్టింది. గ్రూప్-2 లో 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది ప్రకటన చేయగా.. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే ముందుగా ఆగస్టు 29,30న గ్రూప్ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ జారీ చేశారు.
Also Read: ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో.. భట్టి కీలక వ్యాఖ్యలు!
అయితే వరుసగా గ్రూప్-1(Group-1), 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయ్యేందుకు సమయం లేకపోవడంతో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో పరీక్షలను నవంబర్ 2, 3 తేదీలకు వాయిదా వేశాయి. కానీ నవంబర్ 3 నుంచి ఎలక్షన్ ప్రక్రియ మొదలుకావడంతో.. కమిషన్ ఈ పరీక్షలను జనవరి 6,7వ తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ప్రస్తుతం కమిషన్ గ్రూప్-2 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష కేంద్రాలు గుర్తించడానికి వీలుగా జిల్లా కలెక్టర్లకు కూడా లేఖలు రాసింది. గ్రూప్-1, గ్రూప్-2 తో పాటు ఇతర నియామక పరీక్షల పరిస్థితిపై ఇప్పటికే ప్రభుత్వం వివరాలు తీసుకొంది. అయితే దీనిపై త్వరలోనే సమీక్ష చేయనుంది. అయితే ఈ సమీక్షలో త్వరలోనే గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: ‘నా సత్తా ఏంటో చూపిస్తా..’ కోమటిరెడ్డి సంతకం చేసిన ఫైళ్ల వివరాలు ఇవే!