జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌కు రుషికొండ మీద అంత ప్రేమ ఎందుకొచ్చిందో అర్థం కావడంలేదన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చిన ప్రతి సారి రుషికొండకు వెళ్తున్నారన్న ఆమె.. ఆయనకు రుషికొండపై పనేంటని ప్రశ్నించారు. రుషికొండకు ఎదురుగా లోకేష్ బంధువుకు చెందిన గీతం యూనివర్సిటీ ఉందన్న ఎమ్మెల్సీ.. పవన్ అక్కడికి ఎందుకు వెళ్లడం లేదన్నారు. కొండను తోడేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పవన్.. కొండమీదే ఉన్న వేంకటేశ్వర స్వామి గుడి గురించి కానీ, రామానాయుడు స్టూడియో గురించి కానీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దూసుకుపోతోందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఓనమాలు కూడా నేర్చుకోలేదన్న ఆమె.. ఓనమాలు నేర్చుకునేందుకే ఆయన విశాఖ వస్తున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ నగరానికి వస్తున్న జనసేన అధినేతకు నగరం అభివృద్ధి చెందడం మాత్రం ఇష్టంలేదని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ అధికార పార్టీ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పవన్ సీఎం జగన్‌పై, మంత్రులపై, ఎమ్మెల్యేలపై లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు భద్రత పెరిగిందన్నారు. సీఎం జగన్ మహిళల కోసం దిశ పోలీస్ స్టేషన్‌లను తీసుకొచ్చారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. మహిళలు సీఎంగా ఉన్న రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలో భద్రత ఉందన్నారు.
విశాఖను సీఎం జగన్ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారన్నారు. రానున్న రోజుల్లో విశాఖ నగరం హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చెందుతుందని వరుదు కళ్యాణి జోస్యం చెప్పారు. జగన్ సిటీని అభివృద్ధి చేస్తే.. ప్రజలు తమను పట్టించుకోరనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ నగరం అభివృద్ధి చెందకూడదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కుట్ర చేస్తున్నారన్న ఎమ్మెల్సీ.. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ విశాఖకు వచ్చి ప్రజలను రెచ్చగొట్టి హింసను సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ హింసను సృష్టించాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్సీ హెచ్చరించారు. పోలీసుల అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ నగరానికి వచ్చి తప్పు చేశారని వరుదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ మరో తప్పు జరుగకుండా జనసేన పార్టీ కార్యకర్తలను, తన అభిమానులను కంట్రోల్ చేయాలని సూచించారు. లేకపోతే నగరంలో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందన్నారు.