Electoral Bonds: రాజకీయ పార్టీలను కుదిపేస్తున్న ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? పూర్తి వివరాలివే! సుప్రీంకోర్టు మొట్టికాయల తర్వాత రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అసలు ఈ బాండ్స్ ఏమిటి? అభ్యంతరాలు ఎందుకు వచ్చాయి? పూర్తి వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By KVD Varma 15 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి What are Electoral Bonds: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. సరిగ్గా ఇలాంటి సమయంలో అధికార బీజేపీతో పాటు దేశంలోని అన్ని రాజకీయపార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ సెగ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో బాండ్స్ వివరాలను ఎస్బీఐ(SBI) ఈసీ(EC)కి సమర్పించడం.. ఎన్నికల సంఘం ఆ వివరాలను తన అధికారిక వెబ్సైట్ లో పొందుపరచడం చకాచకా జరిగిపోయాయి. నిజానికి ఎస్బీఐ ఎన్నికల బాండ్ల వివరాలను జూన్ లో సబ్మిట్ చేస్తామని పిటిషన్ వేసినా సుప్రీంకోర్టు మాత్రం అంగీకరించలేదు. పనిలో పనిగా మొట్టికాయలు కూడా వేసింది. ఇక ఎస్బీఐ బాండ్ల వివరాలను సమర్పించాల్సి వచ్చింది. 763 పేజీలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసుకుంది. ఈ బాండ్లలో రూ.11,562 కోట్లతో బీజేపీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. సుప్రీం షాక్: ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయా పార్టీలను షాక్ కు గురి చేసింది. గత ఫిబ్రవరి 14న రాజకీయ పార్టీలకు విరాళాలపై కీలకమైన తీర్పు ఇచ్చింది. మోదీ ప్రభుత్వం 2017లో తెచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ చెల్లవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ ఎన్నికల బాండ్ పథకం (Electoral Bonds Scheme) రాజ్యాంగ విరుద్దామని చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. వెంటనే ఈ బాండ్స్ ఇష్యు ఆపేయాలని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది. అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి? వీటిని ఎప్పుడు మనుగడలోకి తెచ్చారు? ఈ బాండ్స్ ఎవరు తీసుకోవచ్చు? ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు సుప్రీం కోర్టు నిలిపివేసింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వివరంగా తెలుసుకుందాం. ఎలక్టోరల్ బాండ్ అంటే ఏమిటి..? వ్యక్తులు లేదా సంస్థల ద్వారా రాజకీయ పార్టీలకోసం విరాళాల సేకరణ చేయడానికి ఈ బాండ్స్ (Electoral Bonds)తీసుకువచ్చారు. వీటిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా విక్రయిస్తారు. మొదటిసారిగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ ని 2017 కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. దీనికోసం ఆర్థిక చట్టం-2017 సవరణలు చేసి బాండ్స్ విధానము తీసుకువచ్చారు. వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల్లో బాండ్లను విక్రయిస్తారు. ఎవరైనా సరే.. నచ్చిన పార్టీ పేరు మీద బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఇలా కొన్నబాండ్లను పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. అంతేకాదు.. ఒక వ్యక్తి లేదా సంస్థ కొన్న బాండ్లను పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు. ఇలా విరాళంగా ఇచ్చిన బాండ్స్ ని సంబంధిత రాజకీయ పార్టీ 15 రోజుల్లో నగదుగా మార్చుకోవాలి. లేకపోతె ఆ డబ్బు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ (PM Relief Fund) కు వెళ్ళిపోతుంది. 2018 నుంచి 2021 వరకూ 15 దశల్లో 6535.75 కోట్ల రూపాయల విలువైన 12,924 బాండ్స్ అమ్మకం జరిగింది. ఈ బాండ్స్ లో పెద్ద అభ్యంతరకర విషయం ఏమిటంటే.. వ్యక్తులు, సంస్థలు, ధార్మిక ట్రస్టులు, ఎన్జీఓల పేర్లు బహిర్గతం చేయకుండా.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు విరాళాలు ఇవ్వచ్చు. దీనినే సుప్రీం కోర్టు కూడా తప్పు పట్టింది. అర్హతలు ఏమిటి? ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ద్వారా విరాళాలను(Electoral Bonds) స్వీకరించడానికి అర్హతలు ఏమిటనే విషయాన్నీ పరిశీలిద్దాం. ప్రజాప్రాతినిధ్యం చట్టం, 1951 (43) సెక్షన్ 29A కింద రాజకీయ పార్టీ రిజిస్టర్ అయి ఉండాలి. లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీ (Political Parties) కనీసం ఒక్క శాతం ఓటు షేరు సాధించాలి. ఎన్నికల సంఘం ధృవీకరించిన ఎకౌంట్ రాజకీయ పార్టీ కలిగి ఉండాలి. ఇలా అన్ని అర్హతలు ఉన్న పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవడానికి వీలవుతుంది. ఎలక్టోరల్ బాండ్లకు ఎంతో ప్రాచుర్యం.. ఎలక్టోరల్ బాండ్లు ప్రవేశపెట్టిన మూడేళ్లలోనే అత్యంత ప్రజాదరణ పొందాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీల ఆదాయం సగానికి పైగా పెరిగింది. 2017-19, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు 2760.20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక బీజేపీకి ఈ బాండ్స్ ద్వారా అత్యధిక విరాళాలు వచ్చాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా.. బీజేపీకి (BJP) అందిన విరాళాలు రూ.1917 కోట్లు. అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2120 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? ఎలక్టోరల్ బాండ్లు విరాళంగా ఇచ్చే దాతల పేరు రహస్యంగా ఉంచడం అదేవిధంగా ఎన్నికల సంఘానికి విరాళాల వివరాలను చెప్పనవసరం లేకపోవడం విషయంలో విపక్షాలు అదేవిధంగా రాజకీయ పరిశీలకులు అభ్యంతరం చెప్పారు. అంతేకాకుండా ఈ విరాళాల లెక్కలు ఆదాయపు పన్ను లెక్కల్లోకి రావు. అలాగే పన్ను చెల్లింపుదారుల ద్వారా ఎస్బీఐకి కేంద్రం కమిషన్లు చెల్లించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ ఏమంటుంది? ఎలక్టోరల్ బాండ్స్‌ను ఈసీ (EC) కూడా వ్యతిరేకిస్తోంది. ఎన్నికల సంఘం చట్టంలోని సవరణను పునఃపరిశీలించాలని 2017 మేలో కేంద్రానికి లేఖ కూడా రాసింది. విరాళాలు గోప్యంగా ఉంచడం ప్రజాప్రాతినిథ్యం చట్టం సెక్షన్ 28B నిబంధనల ఉల్లంఘన అని స్పష్టం ఈసీ స్పష్టం చేస్తోంది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాలని విస్పష్టంగా పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అనీ.. ఈ బాండ్ల జారీ అర్టికల్ (Article) 19(1)(ఏ) ఉల్లంఘన అనీ కోర్టు పేర్కొంది. అలాగే ఈ ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కులను హరిస్తుందని చెప్పింది. ఈ విధానంలో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్‌ప్రోకు దారి తీస్తుందని కోర్టు అభిప్రాయపడింది. విరాళాల దాతలను గోప్యంగా ఉంచడం చట్ట విరుద్ధమని పేర్కొన్న ధర్మాసనం బ్లాక్ మనీని అరికట్టేందుకు ఇది మార్గం కాదని చెప్పింది. నల్లధనం నియంత్రణకు ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయని చెప్పింది సుప్రీం కోర్టు. అదండీ విషయం.. ఎలక్ట్రోల్ బాండ్స్ పై సుప్రీం ఇచ్చిన తీర్పు తర్వాత ఎస్బీఐ రిలీజ్ చేసిన బాండ్ల వివరాలు రాజకీయ పార్టీలను కుదిపేస్తున్నాయి. అన్నిటికన్నా బీజేపీకి ఇది పెద్ద దెబ్బగా చూడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో ఇలా నిధులకు బ్రేక్ పడటం రాజకీయ పార్టీలకు ఇబ్బందులను తీసుకువస్తుందనడంలో సందేహం లేదు. అంతేకాదు.. ఇప్పుడు నిధులను సమకూర్చుకోవడం చాలా కష్టంగా మారే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. సుప్రీం కోర్టు 2018 నుంచి విరాళాలు ఇచ్చిన వారి పూర్తి వివరాలు ఈసీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే విరాళాల వివరాలన్నింటినీ వెబ్సైట్ లో పెట్టాలని స్పష్టం చేసింది. ఇప్పుడు ఎస్బీఐ, ఈసీ అలానే చేశాయి. ఇన్నేళ్ళుగా విరాళాలు ఇచ్చినవారి వివరాలన్నీ బయటకు వచ్చాయి. ఇది బీజేపీ ప్రభుత్వానికి పెద్ద చిక్కులు తెచ్చే అవకాశాలు లేకపోలేదన్నది విశ్లేషకుల మాట. పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన వారి పేర్లు బహిర్గతం కావడం ద్వారా మొత్తం వ్యవస్థలో పెద్ద కుదుపు వచ్చినట్టుగానే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Also Read: ఎలక్టోరల్ బాండ్స్‌లో మేఘా సంస్థ రికార్డు.. రూ. 1588 కోట్లతో సెకండ్ ప్లేస్! #bjp #elections #supreme-court #electoral-bonds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి