Gaganyaan Mission: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టులో టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ పరీక్ష విజయవంతం అయింది. ఇందులోని క్రూ మాడ్యూల్ సురక్షితంగా సముద్ర ఉపరితం మీదకు దిగింది. ఉదయం పది గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లి తర్వాత పారాచూట్లతో కిందకు దిగింది. ఇంతకీ అసలు ఏంటి ఈ గగన్‌యాన్.. ఎందుకోసం ఈ ప్రాజెక్టును ఇస్రో చేపట్టింది. ఆ డీటెయిల్స్ ఇక్కడ చదవండి.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వ్యోమగాములను నింగిలోకి పంపేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ గగన్‌యాన్ (Gaganyaan Mission). ఇందులో భాగంగా ముగ్గురు ఆస్ట్రోనాట్స్‌ను (Astronaut) అంతరిక్షంలోకి పంపాలన్నది ఇస్రో లక్ష్యం. భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి వీరిని పంపి మూడు రోజుల తర్వాత భూమికి రప్పించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. 2025లో ఈ మిషన్‌ను ప్రయోగించే అవకాశం ఉంది. ఈ ప్రయోగం సక్సెస్ చేయడం కోసం ఇస్రో చాలా ఏళ్ళుగా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే మొదటగా టీవీ-డీ1 (TV D1) పరీక్షను నిర్వహించింది. ఇందులో క్రూ ఎస్కేమ్ సిస్టమ్ సమర్ధత, క్రూ మాడ్యూల్ పనితీరు, స్పేస్ షిప్ ను సురక్షితంగా కిందకు తీసుకువచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్టతను పరిశీలించింది. అలాగే అది కింద పడ్డాక సముద్రంలో నుంచి క్రూ మాడ్యూల్‌ను సేకరించి, ఒడ్డుకు చేర్చే క్రమాన్ని కూడా పరీక్షించారు.
గగన్‌యాన్ ఎలా ఉంటుంది?
ఈ గగన్ యాన్ ప్రయోగంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఒకే దశతో కూడిన రాకెట్‌ను ఉపయోగిస్తారు. ఈ రాకెట్ 19.5 మీటర్ల పొడవు ఉంటుంది. మార్పిడి చేసిన వికాస్ ద్రవ ఇంజిన్ సాయంతో ఇది పని చేస్తుంది. ఇక రాకెట్ మీద 15.5 మీటర్ల పొడవైన క్రూ ఎస్కేప్ సిస్టమ్, క్రూ మాడ్యూల్ ఉంటాయి. ఈ క్రూ మాడ్యూల్‌లోనే ఆస్ట్రోనాట్స్ పయనిస్తారు. ఇప్పటివరకు మానవరహితంగా జరిగిన ప్రయోగాలు.. ఇక మీదట గగన్‌యాన్ సాయంతో మానవసహిత ప్రయోగాలుగా మారే అవకాశం ఉంది. ఇక క్రూ మాడ్యూల్‌ను క్షేమంగా కిందకి తీసుకువచ్చే డిసలరేషన్ వ్యవస్థలో పది పారాచ్యూట్‌లు ఉంటాయి. వీటి సహాయంతోనే వ్యోమగాములు కిందకు దిగుతారు.
Also Read:నగరం కింద మరో నగరం ఉంది-గాజా మీద దాడి అంత ఈజీ కాదు
ఎలా పని చేస్తుంది?
మొదటగా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాక ఇస్రో శాస్త్రవేత్తలు అబార్ట్ సంకేతాన్ని పంపిస్తారు. ఈ క్రమంలో రాకెట్ పైభాగంలో ఉన్న క్రూ ఎస్కేప్ వ్యవస్థకు (Crew Escape System) సంబంధించిన మోటార్లు ఆన్ అవుతాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో ఇది రాకెట్ నుంచి విడిపోతుంది. తురవాత 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్ , క్రూ మాడ్యూల్ విడిపోతాయి. ఆ తర్వాత డ్రోగ్ పారాచ్యూట్లు విచ్చుకుంటాయి. సెకన్‌కు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ సముద్రంలోకి దిగుతుంది.
గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా మొత్తం నాలుగు టెస్ట్‌లు నిర్వహిస్తోంది ఇస్రో. ఇందులో మొదటిది టీవీ-డీ1. 2018లోనే ఈ పరీక్షలు చేపట్టినప్పటికీ.. కొంతవరకు మాత్రమే చేపట్టారు. ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధమై పరీక్షను నిర్వహించారు. అయినప్పటికీ ఇవాళ జరిగిన ప్రయోగంలో కూడా సాంకేతిక లోపాలు తలెత్తాయి. అయితే వాటిని వెంటనే పరిష్కరించి ప్రయోగాన్ని విజయవంతం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఈ ఫలితాల ఆధారంగా తరువాతి పరీక్షలకు సిద్ధమయ్యారు ఇస్రో శాస్త్రవేత్తలు.