T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ కరీబియన్ ద్వీపాలు, అమెరికా(America) సంయుక్త ఆతిథ్యంలో మరికొద్ది వారాలలో ప్రారంభంకానున్న 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో తలపడే మొత్తం 20 దేశాలు తమతమ జట్లను ప్రకటించాయి. సంయుక్త ఆతిథ్యమిస్తున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సైతం 15 మంది సభ్యుల జట్టు వివరాలను ప్రకటించింది. యువఫాస్ట్ బౌలర్, గబ్బా టెస్ట్ హీరో షమార్ జోసెఫ్ సైతం ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించగలిగాడు.
ఇప్పటికే రెండుసార్లు ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సాధించిన వెస్టిండీస్(West Indies) మూడో టైటిల్ కు గురిపెట్టింది. సంయుక్త ఆతిథ్య దేశం హోదాలో ..స్థానబలంతో చెలరేగిపోడానికి వీలుగా..సూపర్ హిట్టర్లు, వీరబాదుడు బ్యాటర్లతో కూడిన భీకరమైన జట్టును ప్రకటించింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చైర్మన్ డెస్మండ్ హేన్స్ నేతృత్వంలో 15 మంది సభ్యుల జట్టు ఎంపిక కార్యక్రమాన్ని పూర్తి చేశారు.ఆల్ రౌండర్ రోవ్ మన్ పావెల్ నాయకత్వంలోని కరీబియన్ జట్టులోని ఇతర ఆటగాళ్లలో అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్ మేయర్, జేసన్ హోల్డర్, షాయ్ హోప్, అకిల్ హుస్సేన్, షమార్ జోసెఫ్, బ్రెండన్ కింగ్, గుడకేశ్ మోతీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ ఫానే రూథర్ ఫర్డ్, రోమారియో షెఫర్డ్ ఉన్నారు. జట్టులో చోటు దక్కించుకోడంలో విఫలమైన ప్రముఖ ఆటగాళ్ళలో కీల్ మేయర్స్, ఒషానే థామస్ ఉన్నారు.
జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా దేశాలు వేదికగా ప్రపంచకప్ జూన్ 2న ప్రారంభంకానుంది. మొత్తం 20 జట్లు 4 గ్రూపులుగా తలపడనున్నాయి. ఆతిథ్య వెస్టిండీస్ జట్టు తన ప్రారంభమ్యాచ్ ను గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా పసికూన పాపువా న్యూగినియాజట్టుతో పోటీపడనుంది. జూన్ 9న గయానా వేదికగానే ఉగాండాతోనూ, జూన్ 13న ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని తారుబా స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తోనూ, జూన్ 18న గ్రాస్ ఐలెట్ లోని సెయింట్ లూకా స్టేడియం వేదికగా అప్ఘనిస్థాన్ తోనూ గ్రూప్ లీగ్ మ్యాచ్ లు ఆడనుంది.
టీ-20 లో టాప్ ర్యాంకర్ గా ఉన్న భారత్(India) హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. గత 11 సంవత్సరాలుగా ఐసీసీ(ICC) ప్రపంచకప్ కు నోచుకోని భారత్ రోహిత్ శర్మ నాయకత్వంలో తన అదృష్టం పరీక్షించుకొంటోంది. అమెరికా వేదికగా భారత్ తన గ్రూప్ లీగ్ మ్యాచ్ లు ఆడనుంది.
Also Read : విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టును అనుమతి కోరిన జగన్