Weather Incident: ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులు మానవ సమూహాలకు భారీ నష్టం కలిగిస్తున్నాయి. భారీ వర్షాలతోపాటు వరదలు, కొండ చరియలు విరిగిపడటం వల్ల లక్షలమంది చనిపోయారు. కొన్ని గ్రామాలతో పాటు అడవి ప్రాంతాలు సైతం నామారూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. విజయవాడ, ఖమ్మం వంటి పలు ప్రాంతాలు నీట మునగడంతో స్థానిక ప్రజలు తల్లడిల్లిపోయారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా తాడ్వాయి- మేడారం అడవి ప్రాంతం కొంతమేరకు ద్వంసమైంది. వేల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. ఈ నేపథ్యంలో అడవిలో జీవిస్తున్న వన్య ప్రాణుల పరిస్థితి ఏంటి? అవి ఏమయ్యాయనే అంశంపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆనవాళ్లు లభించకపోవడంపై ఆశ్ఛర్యం..
నిజానికి వన్యప్రాణులకు ప్రకృతి విత్తులను ముందే పసిగట్టే గుణం ఉంటుంది. దీని ఆధారంగానే తాడ్వాయి- మేడారం అడవుల్లో ఆగస్టు 31న 500 ఎకరాల విస్తీర్ణంలో వృక్షాలు నేలకొరిగకముందే వన్యప్రాణులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ భారీ విపత్తులోనూ వన్యప్రాణులకు నష్టం వాటిల్లినట్లు ఎక్కడా ఆనవాళ్లు లభించకపోవడం ఇందుకు బలమైన ఆధారం.
వాసన పసిగట్టి ముందే వెళ్లిపోయాయి..
వాసన, శబ్దాలను త్వరగా గుర్తించే గుణమున్న జీవులు.. భూ ప్రకంపనలను ముందే పసిగడతాయని, ఆ రోజు కూడా ముందే కనిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఉంటాయని భూపాలపల్లి రిటైర్డ్ డీఎఫ్‌వో పురుషోత్తం చెప్పారు. రెండు గంటల వ్యవధిలో 500 ఎకరాల్లో 50 వేలకు పైగా వందల ఏళ్లనాటి చెట్లు కూకటివేళ్లతో నెలకొరగగా.. కనీసం ఒక్క పక్షి, జంతువు కూడా గాయపడినట్లు కనిపించలేదు. జింకలు, ఎలుగుబంట్లు, కొండ గొర్రెలు, అడవి పందులు, కోతులు, ఉడుతలు, కుందేళ్లు, అడవి దున్నలు, నీలుగాయిలతోపాటు పక్షి జాతులన్నీ విపత్తును కనిపెట్టి వెళ్లిపోయినట్లు అటవీ అధికారులు తెలిపారు. నేలకొరిగిన వృక్షాల లెక్కింపు ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.