/rtv/media/media_files/2025/10/25/rain-alert-2025-10-25-08-02-33.jpg)
Rain Alert
Rain Alert: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వచ్చే మూడు రోజులు వాతావరణం తీవ్రంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, రానున్న రోజుల్లో ఇది మరింత బలపడనుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
శనివారం నాటికి ఈ అల్పపీడనం వాయుగుండంగా, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, 50–70 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.
ప్రఖర్ జైన్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. రైతులు కూడా వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తుపాను సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రానున్న మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఇలా..
శనివారం (అక్టోబర్ 25): కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(AP Rains) కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి.
ఆదివారం (అక్టోబర్ 26): గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు, కడప, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
సోమవారం (అక్టోబర్ 27): కాకినాడ, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.
ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. కోనసీమలో అమలాపురంలో 63మి.మీ., ఏలూరులో 59మి.మీ., కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 55మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
మొత్తానికి, రానున్న మూడు రోజులు ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బంగాళాఖాత తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Follow Us