/rtv/media/media_files/2026/01/25/rickshaw-2026-01-25-21-36-21.jpg)
ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లా మోదీపడ గ్రామానికి చెందిన బాబూ లోహార్ వృత్తిరీత్యా రిక్షా కార్మికుడు. 70 ఏళ్ల వయసులో కాయకష్టం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, గతేడాది నవంబర్‌లో ఆయన భార్య జ్యోతికి పక్షవాతం రావడంతో ఆయన జీవితం తలకిందులైంది. స్థానిక వైద్యులు జ్యోతిని కటక్‌లోని ఎస్‌సీబీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. సంబల్‌పూర్ నుండి కటక్‌కు దాదాపు 300 కిలోమీటర్ల దూరం. అంబులెన్స్ లేదా ప్రైవేట్ వాహనాన్ని అద్దెకు తీసుకునే ఆర్థిక స్తోమత లోహార్‌కు లేదు. కానీ తన భార్యను ఎలాగైనా కాపాడుకోవాలన్న సంకల్పంతో తనకున్న ఏకైక ఆస్తి అయిన రిక్షానే అంబులెన్స్‌గా మార్చాడు.
రిక్షాలో పాత పరుపులు పరిచి భార్యను పడుకోబెట్టి, ఎముకలు కొరికే చలిలో ప్రయాణం మొదలుపెట్టాడు. రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున తొక్కుతూ, రాత్రిపూట రోడ్డు పక్కన దుకాణాల వద్ద తలదాచుకుంటూ, తొమ్మిది రోజుల పాటు శ్రమించి 300 కిలోమీటర్ల దూరంలోని కటక్ ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆసుపత్రిలో రెండు నెలల పాటు చికిత్స పొందిన అనంతరం, జ్యోతి ఆరోగ్యం కొంత కుదుటపడటంతో జనవరి 19న మళ్లీ అదే రిక్షాలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మార్గమధ్యంలో చౌద్వార్ సమీపంలో ఒక వాహనం వీరి రిక్షాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి తలకు గాయమైంది. స్థానిక పోలీసులు గమనించి సహాయం చేయడానికి, వేరే వాహనం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ, లోహార్ తన రిక్షాను వదిలి రావడానికి నిరాకరించాడు.
"నా జీవితంలో నాకు ఇద్దరే ఇద్దరు ఇష్టం. ఒకరు నా భార్య, మరొకటి నా రిక్షా. ఈ రెండింటినీ నేను వదలలేను" అని బాబూ లోహార్ కన్నీటి పర్యంతమయ్యారు. చివరికి పోలీసులు ఇచ్చిన స్వల్ప ఆర్థిక సాయాన్ని తీసుకుని, భార్యను సురక్షితంగా రిక్షాపైనే సంబల్‌పూర్ చేర్చారు. వెళ్లడానికి 300 కి.మీ, రావడానికి 300 కి.మీ.. మొత్తంగా 600 కిలోమీటర్లు రిక్షా తొక్కిన ఈ వృద్ధుడి గాథ, ఆధునిక కాలంలో నిస్వార్థ ప్రేమికులకు ఒక గొప్ప నిదర్శనం.
Follow Us