Vijayawada Floods : కృష్ణా నదికి భారీ వరద (Heavy Flood) లతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ (YSRCP) అధ్యక్షుడు వైయస్ జగన్ (YS Jagan) నాయకులతో సమీక్షించారు. అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా (NTR District) పార్టీ నాయకులతో ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ ఈ సందర్భంగా వెల్లడించారు. అది ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని, లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో పలువురు నాయకులు జగన్ కు తెలిపారు.
కేవలం ప్రచార ఆర్భాటం తప్పా.. వాస్తవంగా ఎలాంటి చర్యలు అక్కడ లేవని వారు జగన్ కు వివరించారు. వరద ప్రాంతాల్లో షో చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ, సీఎం పర్యటిస్తున్నారని, అధికార యంత్రాంగమంతా ఆయనతో ఉంటూ, ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. దీంతో వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా, వారికి మందులు కూడా లభించడం లేదని, చివరకు పాలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
జగన్ తో సమావేశం అయిన వారిలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు మెరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, పార్టీ నాయకుడు షేక్ ఆసిఫ్ తదితరులు ఉన్నారు.
Also Read : నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్!