రౌడీ ఫ్యాన్స్ కు సూపర్ గుడ్ న్యూస్ ఇది. విజయ్ దేవరకొండ సినిమా 2 భాగాలుగా రాబోతోంది. కెరీర్ లో విజయ్ దేవరకొండకు ఇదో కొత్త అనుభవం కాగా, ఈ న్యూస్ తో అతడి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే..
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో కంప్లీట్ యాక్షన్ మోడ్ లో కనిపించబోతున్నాడు విజయ్. ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈసారి చాలా పెద్ద కథ రాసుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఆ కథను రెండున్నర గంటల్లో చెప్పడం సాధ్యం కాదంట. ఎలా చూసుకున్నా, ట్విస్టులన్నీ కలిపితే దాదాపు 6 గంటలకు పైగానే వస్తోందట. దీంతో సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇంకా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. హాట్ జోడీ రష్మిక-విజయ్ దేవరకొండ మళ్లీ కలిసిన సినిమా కూడా ఇదే. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్-రష్మిక మళ్లీ కలిసి సినిమా చేయలేదు. ఇన్నాళ్లకు గౌతమ్ తిన్ననూరి సినిమాతో వీళ్లిద్దరూ కలిశారు. నిజానికి ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేక ఆమె తప్పుకుంది. దీంతో ఆ స్థానంలో రష్మికను తీసుకున్నారు.
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా షూటింగ్ దాదాపు 50శాతం పూర్తయింది. ఈ మూవీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే గౌతమ్ తిన్ననూరి యాక్షన్ ఎంటర్ టైనర్ మొదలవుతుంది.