Elinati shani : ఏలినాటి శని అంటే ఏమిటీ? ఎన్నేళ్లు ఉంటుంది?.. పరిహారాలు ఏం చేయాలి?

ఏలినాటి శని అనగానే చాలామంది భయపడిపోతుంటారు. కానీ, అంతలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జ్యోతిష పండితులు అంటున్నారు.  ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ముప్పై ఏళ్లకోసారి తప్పనిసరిగా వచ్చి ఏడున్నరేళ్లు ఉంటుందని వారు చెబుతున్నారు.

New Update
FotoJet - 2025-11-24T091341.776

Elinati shani

Elinati shani : ఏలినాటి శని అనగానే చాలామంది భయపడిపోతుంటారు. కానీ, అంతలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జ్యోతిష పండితులు అంటున్నారు.  ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ముప్పై ఏళ్లకోసారి తప్పనిసరిగా వచ్చి ఏడున్నరేళ్లు ఉంటుందని వారు చెబుతున్నారు. అలా అని శనిని తిట్టుకోవలసిన అవసరంలేదు. శని ఆయుఃకారకుడు. మందగమనుడు గనక తలపెట్టిన పనులను కాస్త ఆలస్యం చేస్తాడు తప్ప అసలు చేయకుండా ఉండడు. పెళ్లిళ్లు, పదోన్నతులు వంటివే కాక ఏ శుభ కార్యాలైనా కేవలం శని మూలంగా ఆగే అవకాశం లేదు. అనుకున్నవి కావడం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇతర గ్రహ ప్రభావాలూ ఉంటాయని గమనించాలని పండితులు సూచిస్తున్నారు.

శని ప్రభావం ఎలా ఉంటుందంటే?


ఏలినాటి శని ప్రభావం ఏడున్నర ఏళ్లు వుంటుంది. ఏలినాటిని ఏడునాడు అని కూడా అంటారు. నాడు అంటే అర్ధభాగం అని అర్థం. జాతకచక్రంలో 12 రాశులుంటాయి. గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ప్రవేశిస్తుంది. ఒక్కోస్థానంలో శని రెండున్నరేళ్లు వుంటాడు. దీంతో మొత్తంగా ఏడున్నర సంవత్సరాలు శని వుంటాడని తెలుస్తోంది. శనిని పాపగ్రహం అంటారు. అందుకనే కష్టాలు కలుగుతాయి. ఈ గ్రహం మన రాశిలో ఉన్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం, ఒక వేళ వచ్చినా వెళ్లిపోవడం, మంచిస్థానం నుంచి అథ‌మ‌స్థానానికి వెళ్లిపోవడం.. వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. శని మన రాశిలో ప్రవేశించినప్పటికీ కొన్ని మంచిపనులు చేసేందుకు కూడా దోహదం చేస్తాడు. ఉదాహ‌ర‌ణ‌కు వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి. అయితే వీటి వెనుక చాలా ఇబ్బందులు ఉంటాయి. వివాహం జరిగితే చాలా ఖ‌ర్చవుతుంది. అలాగే ఇంటి నిర్మాణం పూర్తి చేయడమో లేక ఇంటిని కొనుగోలు చేస్తే అనంతరం ఆర్థిక వనరులకు కటకట ఏర్పడుతుంది. ఒక ఉద్యోగి ఇంటిని కొనుగోలు చేస్తే అతడి నెల జీతం నుంచి నెలవారీగా వాయిదాలు కట్టవలసిరావడం వంటి సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

పరిహారాలు ఏం చేయాలి? 


ఏలినాటి శనిని పూర్తిగా తొలగించలేం. కానీ, శని ప్రభావ తీవ్రతను కొంత తగ్గించవచ్చు. దానికి పెద్దవాళ్లు అనేకమార్గాలు సూచించారు. విష్ణుసహస్రనామం, సుందరాకాండ పారాయణం, ఆదిత్యహృదయం, భగవంతుని ప్రార్థన చేయాలి. దీంతో పాటు తీర్థయాత్రలు, వ్రతాలు ఆచరించాలి. శనివారం రోజు అరచేతి వెడల్పున్న నల్లవస్త్రంలో నల్ల నువ్వులు మూటలా కట్టి శనీశ్వరుడికి దానితో దీపారాధన చేయాలి. లేదా నవగ్రహాలకు తొమ్మిదిసార్లు ప్రదక్షిణచేసి, శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించినా ఫలితం ఉంటుందని చెబుతారు. ఇలా తొమ్మిది వారాలు చేస్తే దోషాలు, కష్టనష్టాలు దూరమవుతాయన్నది శాస్త్రవచనం. 

పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. పక్షులకు ఆహారం వేయాలి. ముఖ్యంగా కాకులకు ఆహారం పెడితే మంచిది. ఆవులకు ఆహారం వేయడంతో పాటు నల్ల చీమలకు చక్కెర వేయడం లాంటి కార్యాలతో శని ప్రభావాన్ని తగ్గించవచ్చని పెద్దలు చెబుతున్నారు. యాచకులు,  దివ్యాంగులకు పెరుగన్నం పెట్టినా శని తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు. అన్నింటికన్నా మనస్సును స్థిరంగా, పవిత్రంగా ఉంచుకొని ఆ పరమేశ్వరుని ఆరాధనలో ఉంటే ఏ గ్రహ ప్రభావమూ మనపై పడదని. అలాగే ఏలినాటిశని దోష నివారణకు ఇనుముతో ఒక చిన్న శని విగ్రహాన్ని చేయించి, దాన్ని మట్టికుండ లేదా ఇనుపపాత్రలో ఉంచాలి. దానిపై నల్లటి వస్త్రం కప్పి, పూలూ గంధంతో పూజించి నువ్వులు, పులగంతోపాటు శక్తికొద్దీ దానం చేస్తే ఏలినాటి శని నివృత్తి అవుతుందని పండితులు సూచిస్తున్నారు.

సూచన: ఈ జ్యోతిష సమాధానాలు కేవలం జ్యోతిష పండితుల అభిప్రాయం మాత్రమే. అవసరమైన ముందు జాగ్రత్త కోసమే. వాటికి ఆర్ టీవీ కానీ.సంస్థ కానీ ఎలాంటి బాధ్యత వహించదు.

Advertisment
తాజా కథనాలు