Venkaiah Naidu Birthday : నిండైన తెలుగుదనం..చురుకైన వాగ్ధాటి కి పుట్టినరోజు!

ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా , బీజేపీ జాతీయాధ్యక్షుడిగా తెలుగు జాతికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన గొప్పనేత ముప్పవరపు వెంకయ్య నాయుడు నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్‌ స్టోరీ!

Venkaiah Naidu Birthday : నిండైన తెలుగుదనం..చురుకైన వాగ్ధాటి కి పుట్టినరోజు!
New Update

Venkaiah Naidu Birthday : ముప్పవరపు వెంకయ్య నాయుడు....తన ఆహార్యం, మాట తీరు, నిండైన పంచెకట్టు, తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే వ్యక్తిత్వం. దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టి..చేసిన ప్రతి హోదాలోను ఆయన హుందాతనం చూపించి రాజకీయాల్లో ఆయనదైన ముద్ర వేశారు.

తెలుగు జాతికే గర్వకారణమైన నేత. దేశంలో ఏ మూలన సంక్షోభం వచ్చినా.. నేనున్నానంటూ కదిలివచ్చి తనదైన శైలిలో సమస్యను పరిష్కరించే అపర మేధావి. అలాంటి ప్రముఖుడు దేశంలోని అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉప రాష్ట్రపతి పదవి చేపట్టి సేవలు అందించడం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు 1949 జులై 1న వెంకయ్య నాయుడు జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వెంకయ్య నాయుడు.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల పట్ల మక్కువ చూపారు.

publive-image

చిన్నతనం నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవక్‌గా పని చేశారు. దీంతో క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన జీవితం ఆయనకు వచ్చింది.
కాలేజీలో చదివే రోజుల్లోనే ఏబీవీపీలో చేరి చురుగ్గా పని చేశారు. వీఆర్‌ కాలేజిలో పాటు ఆంధ్రా యూనివర్సిటీలోనూ స్టూడెంట్స్‌ యూనియన్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఆంధ్ర లా కాలేజీ తరఫున ఏబీవీపీ అధ్యక్షుడిగా ఎన్నికవడం వెంకయ్య జీవితంలో కీలక మలుపు అని చెప్పవచ్చు.

publive-image

1977లో ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ స‌మ‌యంలో జరిగిన ఆందోళనల్లో వెంకయ్య పాల్గొన్నారు. జైలుకు కూడా వెళ్లారు. 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉదయగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పట్లో దేశమంతా ఇందిరా గాంధీ హవా ఉన్నా.. ఉదయగిరిలో మాత్రం వెంకయ్యనే విజయం వరించింది. స్వయంగా ఇందిరాగాంధీ నే ప్రచారానికి దిగినా ఆయన్ని ఓడించలేకపోయారు. ఆ విధంగా ఆయన తొలిసారి ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టి రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

publive-image

1983 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ గాలి వీచినా.. ఉదయగిరిలో మాత్రం వెంకయ్యనాయుడే గెలిచారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి పెద్దదిక్కుగా మారారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. పార్టీలో అనేక కీలక పదవులు ఆయన్ని ఏరి కోరి వచ్చాయి. 1996 నుంచి 2000 వరకూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 1998లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు.

publive-image

2000 సెప్టెంబర్‌ నుంచి 2002 జూన్‌ వరకు వాజ్‌పేయి హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య సేవలందించారు. 2002 జులైలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికై 2004 చివరి వరకు ఆ పదవిలోనే ఉన్నారు. ఆ తర్వాత మరో రెండుసార్లు అంటే 2004, 2010లోనూ వరసగా రాజ్యసభ ఎంపీ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరించారు. తెలుగే కాకుండా.. ఇంగ్లీష్, హిందీ భాషలపై వెంకయ్యనాయుడుకు మంచి పట్టు ఉండటం.. ఆయన రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎంతగానో ఉపయోగపడింది.

publive-image

2014లో మోదీ కేబినెట్‌లో సమాచార ప్రసారాల శాఖతో పాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వెంకయ్య.. సామాజిక కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటారు. స్వర్ణ భారతి ట్రస్ట్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వెంకయ్య భార్య ఉష, కుమారుడు హర్ష, కూతురు దీప ఉన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ వ్యవహారాలను దీపనే చూసుకుంటున్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే తమ అభ్యర్థిగా ఈ మేరునగధీరుణ్ణి ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఆయన ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు.

publive-image

ఈక్రమంలోనే వెంకయ్య 75 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని.... గ్రామ స్థాయి నుంచి ఉప రాష్ట్రపతిగా ఎదిగిన గొప్ప వ్యక్తి వెంకయ్య అని, ఆయన జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకమని భారత ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వెంకయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన పై రూపొందించిన మూడు పుస్తకాలను మోదీ వర్చువల్ గా విడుదల చేశారు.

ఆదివారం గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్ లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ‘సేవలో వెంకయ్యనాయుడు జీవితం’, ‘13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం’, ‘మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం’ అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు.

Also read: మీకు సేవకులుగా ఉంటాం..పెత్తందారులుగా కాదు..పెన్షన్ల కార్యక్రమంలో ఏపీ సీఎం!

#modi #birthday #venkayya-naidu #special-story
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe