శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలడాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు రోడ్‌లో గల శ్రీ విజయ దుర్గ అమ్మవారు ధనలక్ష్మి దేవిగా దర్శనం ఇచ్చారు.
సుమారు పది లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారి ఆలయాన్ని ముస్తాబు చేశారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడారు. శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని నోట్లను అలంకరించామని తెలిపారు.
తిరుపతిలో తిరుచానూరు పద్మావతి అమ్మవారిని హీరో నవీన్ పోలిశెట్టి దర్శించుకున్నారు.
నవీన్ పొలిశెట్టిన చూసేందుకు అభిమానులు ఆలయం వద్దకు భారీగా వచ్చారు. దీంతో వాహనం ఎక్కి అభిమానులకు ఆయన అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఇక నగరిలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. వ్రతం సందర్బంగా నగరి మహిళల పాదాలకు మంత్రి రోజా పసుపు పూశారు. అనంతరం తాంబూలం సమర్పించి వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఇక సుప్రసిద్ధ ఆలయం భీమవరంలో పట్టణ ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు కుంకుమార్చన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండి ఆలయానికి పోటెత్తారు.